ECI: భారీగా డేటా విడుదల చేసిన ఈసీ.. దేశంలో మహిళా ఓటర్లే అత్యధికం?

by vinod kumar |   ( Updated:2024-12-26 14:59:31.0  )
ECI: భారీగా డేటా విడుదల చేసిన ఈసీ.. దేశంలో మహిళా ఓటర్లే అత్యధికం?
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. దేశంలో జరిగే ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు ఉత్సాహంగా ఎన్నికల్లో భాగస్వామ్యమై తమ పాత్రను నెరవేరుస్తున్నారు. దీంతో ప్రజలను మరింత ప్రోత్సహించి, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ (EC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లోక్‌సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాలు (అరుణాచల్ ప్రదేశ్, ఆంద్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం)లలో జరిగిన ఎన్నికలకు సంబంధించిన డేటాను గురువారం విడుదల చేసింది. పారదర్శకతను ప్రోత్సహించడం, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకే నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ తెలిపింది. డేటాసెట్‌లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్లు, పోలింగ్ స్టేషన్ నంబర్లు, పార్టీల వారీగా ఓట్ షేరింగ్, లింగ ఆధారిత ఓటింగ్ విధానాలు, మహిళల భాగస్వామ్యం వంటి అంశాల సమాచారం వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. లోక్ సభ ఎన్నికల్లో 64.64 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే ​​ఎక్కువగా ఉండటం గమనార్హం.

దేశంలో 97.97 కోట్ల ఓటర్లు

దేశంలో ఓటరుగా నమోదు చేసుకున్న వారు 2019లో 91.19 కోట్లు ఉండగా 2024 వరకు ఆ సంఖ్య 97.97 కోట్లకు చేరుకుంది. సుమారు 7.43శాతం పెరిగింది. అలాగే 2019లో 61.4 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా గత లోక్ సభ ఎన్నికల్లో 64.64 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయి. వీరిలో 32.3 కోట్ల మంది పురుషులు, 31.27 కోట్ల మంది మహిళలు,13,058 థర్డ్ జెండర్లు ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో 10,52,664 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో అసోంలోని ధుబ్రిలో అత్యధికంగా 92.3శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 38.7శాతంగా నమోదైంది. నోటాకు 63.71 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇది 2019 కన్నా 1.6శాతం తగ్గడం గమనార్హం.

పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం

దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ​​ఎక్కువగా పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 65.78శాతం మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, పురుషులు 65.55శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. అసోంలోని ధుబ్రిలోనే అత్యధికంగా 92.17శాతం మంది మహిళలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. అలాగే 2019లో 726 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేయగా 2024 ఎన్నికల్లో 800 మంది బరిలో నిలిచారు. మహారాష్ట్రలో అత్యధికంగా 111 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి 80 మంది బరిలో నిలిచారు. 152 నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్థులు లేకపోవడం గమనార్హం. ఇక 2019తో పోలిస్తే థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 46.4శాతం పెరిగింది. 2019లో 39,075 మంది థర్జ్ జెండర్ ఓటర్లుండగా 2024 నాటికి 48,324కి చేరింది.

తెలంగాణలోని మల్కాజ్ గిరి నుంచి అత్యధిక నామినేషన్లు

అత్యధిక సంఖ్యలో నామినేషన్లు వేసిన పార్లమెంటరీ నియోజకవర్గంగా తెలంగాణలోని మల్కాజ్‌గిరి నిలిచింది. ఈ సెగ్మెంగట్ నుంచి 114 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత అసోంలోని దిబ్రూఘర్‌లో అత్యల్పంగా కేవలం మూడు నామినేషన్లు మాత్రమే నమోదయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తంగా 12,459 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో నామినేషన్ విత్ డ్రా అనంతరం 8,360 మంది బరిలో నిలిచారు. 2019లో ఈ సంఖ్య 8,054గా ఉంది.

జాతీయ పార్టీలకే అత్యధిక ఓట్లు

2024 ఎన్నికల్లో ఆరు జాతీయ పార్టీలు పాల్గొన్నాయి. మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 63.35శాతం ఈ పార్టీలే సాధించాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థులు 3,921 మంది పోటీలో నిలవగా.. కేవలం ఏడుగురు మాత్రమే విజయం సాధించారు. వారికి 2.79శాతం ఓట్లు పోలయ్యాయి. దేశ వ్యాప్తంగా 7,190 మంది అభ్యర్థులు తమ డిపాజిట్లను కోల్పోయారు. గుజరాత్ లోని సూరత్ పార్లమెంటరీ నియోజకవర్గం మాత్రమే ఏకగ్రీవమైంది.

Advertisement

Next Story

Most Viewed