IPL 2024: మైక్ హెస్సె‌న్‌కు గుడ్‌బై.. ఆర్‌సీబీ కొత్త కోచ్ ఎవరంటే..?

by Vinod kumar |
IPL 2024: మైక్ హెస్సె‌న్‌కు గుడ్‌బై.. ఆర్‌సీబీ కొత్త కోచ్ ఎవరంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: RCB.. IPL 2024 సీజన్‌లో టైటిలే లక్ష్యంగా టీమ్ సపోర్ట్ స్టాఫ్ ప్రక్షాళన చేపట్టింది. గత కొన్నేళ్లుగా టీమ్ డైరెక్టర్‌గా.. హెడ్ కోచ్‌గా సేవలందించిన మైక్ హెస్సెన్‌కు వీడ్కోలు పలికింది. అతనితో పాటు బ్యాటింగ్ హెడ్ కోచ్‌గా సేవలందించిన సంజయ్ బంగర్‌కు గుడ్‌బై చెప్పింది. కొత్త కోచ్‌గా జింబాబ్వే మాజీ ప్లేయర్ ఆండీ ఫ్లవర్‌ను నియమించింది. ఆండీ ఫ్లవర్ నేతృత్వంలో ఆర్‌సీబీ కొత్త శకం ప్రారంభం కానుంది. కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌కు అనుభవం ఉంది.

ఐపీఎల్ 2023 సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆండీ ఫ్లవర్.. ఇటీవలే ఆ జట్టును వీడాడు. హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌కు గొప్ప రికార్డు ఉంది. ఇంగ్లండ్ కోచ్‌గా ఆ జట్టుకు టీ20 ప్రపంచకప్ అందించిన ఆండీ ఫ్లవర్.. యాషెస్ సిరీస్‌లో కూడా విజేతగా నిలబెట్టాడు. కరీబియన్ లీగ్‌, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్, ది హండ్రెడ్ 2022, ఇంటర్నేషనల్ లీగ్ 20, అబుదాబి టీ10లో తాను కోచింగ్ ఇచ్చిన జట్లను విజేతగా నిలబెట్టాడు. ఐపీఎల్‌లో లక్నోను రెండు సార్లు ప్లే ఆఫ్స్ చేర్చాడు. ఈ గొప్ప రికార్డు నేపథ్యంలోనే ఆర్‌సీబీ.. ఆండీ ఫ్లవర్‌ను కోచ్‌గా నియమించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఆర్‌సీబీ అధికారిక ట్విటర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. 'ఐసీసీ హాల్ ఫేమర్, టీ20 ప్రపంచకప్ విన్నింగ్ కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ను ఆర్‌సీబీ పురుషుల టీమ్ హెడ్ కోచ్‌గా నియమించాం. ఐపీఎల్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 టోర్నీల్లో కోచ్‌గా అపార అనుభవమున్న ఆండీ ఫ్లవర్.. ఆర్‌సీబీ జట్టును ఛాంపియన్‌గా నిలబెడుతున్నాడని ఆశిస్తున్నాం.'అని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed