పోలీస్ పోస్టింగ్‌లు ఇంకా ఖాళీ.. 16 రోజులు గడుస్తున్నా కొత్త వారికి నో ఛాన్స్

by Aamani |   ( Updated:2024-10-19 10:15:27.0  )
పోలీస్ పోస్టింగ్‌లు ఇంకా ఖాళీ.. 16 రోజులు గడుస్తున్నా కొత్త వారికి నో ఛాన్స్
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఒకే రోజు ఇక్కడ పని చేస్తున్న సీఐ తో పాటు ఎస్సై పై బదిలీ వేటు పడింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో పాటు, అక్రమ దారులకు వత్తాసు పలికారనే నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో అప్పటి సీఐ అశోక్ కుమార్, ఎస్సై వినయ్ కుమార్ లను విఆర్ కు అటాచ్ చేస్తూ మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులను లూప్ లైన్ కు పంపిస్తామని ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్నారు. వీరిద్దరూ బదిలీ అయి నేటికీ 16 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ పోస్టులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.

కొత్త వారికి ఎవరికీ కూడా ఇన్ని రోజులుగా పోస్టింగ్ ఇవ్వడం లేదు. అయితే కొందరు పోలీసు అధికారులు ఇక్కడ పోస్టింగ్ కోసం తమ వంతు పైరవీలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందింది. అయితే గతంలో సంగారెడ్డిలో సీఐగా పనిచేసిన ఒక అధికారికి ఇక్కడ తాజాగా రూరల్ సీఐగా పోస్టింగ్ పొందేందుకు లైన్ క్లియర్ అయినట్లు గా తెలుస్తోంది. అయితే ఎస్ఐ గా మాత్రం కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నది. సోమవారం వరకు సీఐ, ఎస్ఐల పోస్టింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఉండే వారిని పోస్టింగు ఇప్పించేలా పావులు కదుపుతున్నట్టు సమాచారం.

వటపల్లిలో కూడా పెండింగ్...

జోగిపేట లోని వట్టిపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఎస్సై పోస్ట్ ప్రస్తుతం ఖాళీగానే ఉంది. గతంలో ఇక్కడ ఎస్సైగా పని చేసిన లక్ష్మణ్ స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకుడి జన్మదిన వేడుకలు పోలీస్ స్టేషన్ లో నిర్వహించారు. దీనిపై సీరియస్ అయినా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఎస్సై లక్ష్మణ్ ని వెంటనే సస్పెండ్ చేశారు. దాదాపు నెల రోజులుగా ఇక్కడ పోస్టింగ్ ఖాళీ గానే ఉంది. తాజాగా జిల్లాకు చెందిన ఓ అధికారికి ఆ స్థానంలో పోస్టింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story