మాజీ కలెక్టర్ కు ఈడీ నోటీసులు

by M.Rajitha |   ( Updated:2024-10-19 16:48:37.0  )
మాజీ కలెక్టర్ కు ఈడీ నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : అవినీతి అధికారులపై ఈడీ(ED) కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా ఓ భూ కేటాయింపుల విషయమై మాజీ కలెక్టర్ కు నోటీసులు అందజేసింది. ప్రభుత్వ భూ కేటాయింపుల ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ కు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22 లేదా 23న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసు వివర్లలోకి వెళితే.. గతంలో ప్రభుత్వ భూముల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలకు, బిల్డర్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసి ప్రభుత్వానికి నష్టం చేసినట్లు గతంలో అమోయ్ కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి. సీబీఐ, ఈడీ హెడ్ క్వార్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ధారాదత్తం చేశారన్నది అమోయ్ కుమార్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు. సిటీ శివారు ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరుగుతున్న టైమ్‌లో బీఆర్ఎస్ నేతలు చాలా మంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను ప్రైవేటు పట్టలుగా మార్చుకున్నారని, దానికి కలెక్టర్ హోదాలో అమోయ్ కుమార్ సంపూర్ణ సహకారం అందించారన్నది ఆయనపై వచ్చిన ఆరోపణలు, దర్యాప్తు సంస్థలకు వెళ్ళిన ఫిర్యాదుల్లో ప్రధానమైన అంశం.

ఆలస్యంగానైనా అమోయ్ కుమార్‌కు ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు ఆదేశించడం ఇప్పుడు రెవెన్యూ శాఖలోని అధికారుల స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అమోయ్ కుమార్‌తోనే ఈ వ్యవహారం ఆగిపోతుందా?... లేక మరికొద్దిమంది అధికారుల మెడకు చుట్టుకుంటుందా?.. చివరకు బీఆర్ఎస్ పెద్దల దాకా పాకుతుందా?.. ఇవీ ఇప్పుడు జరుగుతున్న చర్చలు. బీఆర్ఎస్ హయాంలో కలెక్టర్ హోదాలో అమోయ్ కుమార్ వ్యవహరించిన తీరుపై తీవ్ర అసృంతృప్తితో ఉన్న ప్రజలు, రైతులతో పాటు పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆయనకు ఈడీ నోటీసులు జారీచేయడంపై సంతోషంగా ఉన్నారు.


Advertisement

Next Story

Most Viewed