వరల్డ్ చాంపియన్‌షిప్‌కు భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ దూరం..

by Vinod kumar |
వరల్డ్ చాంపియన్‌షిప్‌కు భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ దూరం..
X

న్యూఢిల్లీ : ఈ ఏడాది సౌదీ అరేబియా‌లో జరగబోయే వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ జెరెమీ లాల్రినుంగా దూరమయ్యాడు. మే నెలలో లాల్రినుంగా బ్యాక్ పెయిన్‌తో బాధపడ్డాడు. ఆ గాయం నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. దాంతో ఇటీవల ఇండియన్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్(ఐడబ్ల్యూఎల్‌ఎఫ్) నిర్వహించిన ట్రయల్స్‌కు అతను దూరంగా ఉన్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్‌కు దూరం కావడంతో లాల్రినుంగా పారిస్ ఒలింపిక్ బెర్త్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు వరల్డ్ చాంపియన్‌షిప్ అర్హత టోర్నీగా ఉన్నది. ఇటీవల ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన వెయిట్‌లిఫ్టర్ల జాబితాలోనూ లాల్రినుంగా పేరు లేదు.

ప్రస్తుతం అతను పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో కోలుకుంటున్నాడు. మరోవైపు, లాల్రినుంగాపై ఐడబ్ల్యూఎల్ఎఫ్ ప్రెసిడెంట్ సహదేవ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘విజయం అతనికి తలకెక్కింది. కామన్వెల్త్ గేమ్స్‌లో గెలుపొందడంతో ప్రైజ్ మనీ కోట్లలో వచ్చింది. అలాగే టాప్స్ స్కీం ద్వారా నెలకు రూ. 50 వేలు అందుతున్నాయి. దాంతో వారి ఆలోచనధోరణి పూర్తిగా మారిపోయింది. అతను తన టాలెంట్‌ను వృథా చేసుకుంటున్నాడు.’ అని తెలిపాడు. ట్రయల్స్‌లో పాల్గొనకపోవడం, అమెరికాలో చికిత్సకు నిరాకరించడంతో జాతీయ క్యాంప్‌ నుంచి లాల్రినుంగాను తొలగించినట్టు సహదేవ్ యాదవ్ తెలిపారు. వచ్చే ఏడాది జరిగే నేషనల్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటితేనే లాల్రినుంగా తిరిగి జాతీయ క్యాంప్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed