ఒలింపిక్స్-2036లో యోగా, ఖోఖో, కబడ్డీ?.. భారత్ ప్రతిపాదనలు

by Harish |
ఒలింపిక్స్-2036లో యోగా, ఖోఖో, కబడ్డీ?.. భారత్ ప్రతిపాదనలు
X

దిశ, స్పోర్ట్స్ : సమ్మర్ ఒలింపిక్స్-2036 ఆతిథ్య హక్కుల కోసం భారత్ ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఆతిథ్య హక్కులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే, ఆతిథ్య హక్కులను దక్కించుకోవడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మిషన్ ఒలింపిక్ సెల్(ఎంవోసీ) సమగ్ర నివేదికను రూపొందించింది. ఆ నివేదికను తాజాగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండియాకు అందజేసింది. ఆతిథ్య హక్కులు దక్కితే 2036 ఒలింపిక్స్‌లో ఆరు కొత్త క్రీడలను చేర్చాలని ఎంవోసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అందులో యోగా, ఖోఖో, కబడ్డీ, చెస్, టీ20 క్రికెట్, స్క్వాష్ క్రీడలు ఉన్నాయి.

‘ఒలింపిక్ బిడ్ రూపొందించడంలో మేము ముందున్నాం. కానీ, పారిస్ ఒలింపిక్స్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీతో చాలా చర్చలు జరపాల్సి ఉంటుంది. భారత సంప్రదాయ క్రీడలను చేర్చడం ద్వారా ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్య మెరుగుపడుతుంది.’ అని ఎంవోసీ సీనియర్ సభ్యుడు తెలిపారు. 2036 ఒలింపిక్స్‌లో చేర్చడానికి ముందు 2032 బ్రిస్టేన్ క్రీడల్లో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఐవోసీ రూల్స్ ప్రకారం.. ఆతిథ్య ఒలింపిక్ కమిటీ ప్రతిపాదించిన క్రీడలు ఆతిథ్య దేశంలో ప్రసిద్ధి చెంది ఉండటంతోపాటు ఐదు ఖండాల్లో ఆ క్రీడలు ఆడాలి. 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య హక్కుల కోసం గట్టి పోటీనే ఉంది. చైనా, ఖతార్, సౌదీ అరేబియా, హంగేరి, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, కెనడా, స్పెయిన్, ఇంగ్లాండ్, పొలాండ్‌సహా పలు దేశాలు రేసులో ఉన్నాయి.

Advertisement

Next Story