ప్రాణాలతో పోరాడుతున్న స్టార్ ఆల్‌రౌండర్.. షాకింగ్ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి

by Harish |
ప్రాణాలతో పోరాడుతున్న స్టార్ ఆల్‌రౌండర్.. షాకింగ్ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి
X

దిశ, స్పోర్ట్స్ : ఐర్లాండ్ స్పిన్ ఆల్‌రౌండర్ సిమీ సింగ్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. కొంతకాలం క్రితం అనారోగ్యం బారిన పడిన అతను ప్రస్తుతం తీవ్రమైన కాలేయ వైఫల్యంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతను గురుగ్రామ్‌లోని ఓ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. సిమీ సింగ్ ఆరోగ్య పరిస్థితిని అతని మామయ్య పర్వీందర్ సింగ్ వివరించారు. ‘ఐదారు నెలల క్రితం సిమీకి విచిత్రమైన జ్వరం వచ్చింది. చికిత్స తీసుకున్నప్పటికీ విషయం ఏంటనేది తెలియలేదు. సిమీ పరిస్థితి క్షీణిస్తుండటంతో మెరుగైన వైద్యం కోసం జూన్‌లో మొహాలీకి వచ్చాడు. మొదట చంఢీగఢ్‌లోని పీజీఐలో అతనికి టీబీ(క్షయవ్యాధి) కోసం చికిత్స అందించారు. ఆ తర్వాత టీబీ లేదని తేలింది. సెకండ్ ఓపీనియన్ కోసం మొహాలీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరగా ఆరు వారాలకు మెడిసన్ రాశారు. అది పూర్తియిన తర్వాత సిమీకి తీవ్ర జ్వరం రావడంతోపాటు కామెర్ల బారినపడ్డాడు. దీంతో అతన్ని తిరిగి ఆగస్టులో పీజీఐలో చేర్చగా అక్కడ కాలేయం చెడిపోయినట్టు గుర్తించారు. పీజీఐ వైద్యుల సూచన మేరకు సిమీని సెప్టెంబర్ 3న గురుగ్రామ్‌లోని ఆస్పత్రికి తీసుకొచ్చాం. అతను కోమాలోకి వెళ్లే ప్రమాదంఉందని, వీలైనంత త్వరగా కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు’ అని పర్వీందర్ సింగ్ తెలిపారు.

కాలేయ మార్పిడి కోసం సిమీ ఎదురుచూస్తున్నాడు. అతని భార్య తన కాలేయంలో కొంత భాగాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు సిమీ సన్నిహితుల్లో ఒకరు తెలిపారు. కాగా, ఐర్లాండ్‌కు ఆడుతున్న సిమీ సింగ్ భారత్‌లోనే పుట్టి పెరిగాడు. పంజాబ్‌లోని మొహాలీలో జన్మించిన అతను ఆ రాష్ట్రం తరపున అండర్-14, అండర్-17లో ఆడాడు. అండర్-19కు ఎంపిక కాకపోవడంతో హోటల్ మేనేజ్‌మెంట్ చదవడానికి 2005లో ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. అయితే, క్రికెట్‌ను మాత్రం వదలని అతను 2006లో డుబ్లిన్‌లోని మలాహిడె క్రికెట్ క్లబ్‌లో చేరాడు. అలా 2017లో ఐర్లాండ్ తరపున అరంగేట్రం చేసిన అతను జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. 35 వన్డేలు, 53 టీ‌20లు ఆడిన సిమీ..2022లో అక్టోబర్‌లో చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు.

Advertisement

Next Story

Most Viewed