- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరీస్‌పై భారత్ కన్ను.. నేడు ఆస్ట్రేలియాతో రెండో టీ20
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. తొలి టీ20 విజయంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమ్ ఇండియా.. ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకోవాలనుకుంటున్నది. ఇటీవల భారత్‌పై ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను గెలిచి ఆసిస్‌కు షాకివ్వాలని భారత్ భావిస్తున్నది. అంతేకాకుండా, సొంతగడ్డపై ఆసిస్‌పై అందని ద్రాక్షగానే ఉన్న టీ20 సిరీస్ విజయాన్ని కూడా అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. మరోవైపు, తొలి మ్యాచ్ కోల్పోయి వెనుకబడిన ఆస్ట్రేలియాను ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. బలమైన ప్రత్యర్థి రెండో టీ20లో పుంజుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించొచ్చు. కాబట్టి, రెండో టీ20లోనూ భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనపైనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది.
అదే జోరు కావాలి
ఇటీవల వన్డే సిరీస్ కోల్పోయి నిరాశలో ఉన్న భారత జట్టు తొలి టీ20లో పుంజుకున్న తీరు అద్భుతమే అని చెప్పాలి. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆసిస్‌ను చిత్తుగా ఓడించింది. అదే ప్రదర్శననూ రెండో టీ20లోనూ కొనసాగించాలనుకుంటున్నది. బ్యాటింగ్‌పరంగా భారత జట్టు పటిష్టంగానే కనిపిస్తున్నా పలువురు నిలకడ లేమితో బాధపడుతుండటం ఆందోళన కలిగించే అంశం. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఫామ్ లేమితో ఇబ్బంది పడటం జట్టుకు నష్టం కలిగిస్తోంది. వన్డే సిరీస్‌లో దారుణంగా విఫలమైన ఆమె.. తొలి టీ20లో బ్యాటింగ్‌కు రాలేదు. నేటి మ్యాచ్‌లో ఆమె ఫామ్ అందుకోవాల్సి ఉంది. మరోవైపు, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ ఫామ్‌లో ఉండటం బలం. మరోవైపు, దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రదర్శన సానుకూలంశం. అమన్‌జ్యోత్ కౌర్, పూజ వస్త్రాకర్‌ల నుంచి కూడా జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆశిస్తున్నది. తొలి మ్యాచ్‌లో 4 వికెట్లతో సత్తాచాటిన యువ పేసర్ టిటాస్ సాధు అదే జోరును కొనసాగించాల్సి ఉంది. రేణుక సింగ్, శ్రేయాంక పాటిల్ సైతం టచ్‌లోనే ఉన్నారు. మొత్తంగా తొలి టీ20లో ప్రదర్శించిన ఆల్‌రౌండ్ ప్రదర్శననే రెండో మ్యాచ్‌లోనూ కొనసాగించాల్సిన అవసరం ఉన్నది.
సిరీస్ విజయం నిరీక్షణకు తెరపడేనా?
ఇటీవల ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలపై ఏకైక టెస్టుల్లో భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమ్ ఇండియా.. మరో అపూర్వ విజయానికి అడుగుదూరంలో ఉన్నది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై భారత్ ఇప్పటి వరకు టీ20 సిరీస్ సాధించలేదు. 2016లో ఆసిస్ గడ్డపైనే కంగారులపై టీ20 సిరీస్ దక్కించుకున్న ఘనత భారత్ సొంతం. అయితే, సొంతగడ్డపై మాత్రం సిరీస్ విజయం ఇప్పటికీ అందని ద్రాక్షగానే మిగిలింది. 2012, 2022ల్లో భారత్‌లో పర్యటించిన ఆసిస్ రెండు సార్లూ సిరీస్‌ను ఎగరేసుకపోయింది. సిరీస్‌ను దక్కించుకునే అవకాశం ఇప్పుడు భారత్ ముందు ఉంది. ప్రస్తుత టీ20 సిరీస్‌లో తొలి టీ20 గెలుపుతో 1-0తో ఆధిక్యంలో ఉన్న హర్మన్‌ప్రీత్ సేననే సిరీస్‌ను గెలుచుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే, నిర్ణయాత్మక మ్యాచ్‌కు వెళ్లకుండా రెండో టీ20లోనే సిరీస్ దక్కించుకోవాలని భారత్ భావిస్తున్నది.
తుది జట్లు(అంచనా)
భారత్ : షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోస్, అమన్‌జ్యోత్ కౌర్/మన్నత్ కశ్యప్, పూజ వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, రేణుక సింగ్, టిటాస్ సాధు.
ఆస్ట్రేలియా : హీలీ(కెప్టెన్), బెత్ మూనీ, మెక్‌గ్రాత్, ఎల్లీస్ పెర్రీ, గార్డ్‌నెర్, లిచ్‌ఫీల్డ్, కిమ్ గార్త్/గ్రేస్ హారిస్, సదర్లాండ్, వారేహమ్, మేగాన్ షుట్, అలానా కింగ్/డార్సీ బ్రౌన్.