ఐవోసీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా క్రిస్టీ కోవెంట్రీ

by Mahesh |
ఐవోసీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా క్రిస్టీ కోవెంట్రీ
X

‘అమ్మాయికి ఈత అవసరమా.. అని ఎంతోమంది అన్నారు. కానీ ఆ తల్లిదండ్రులు అవేవీ పట్టించుకోలేదు. ‘నీకు ఏది ఇష్టమో అదే చెయ్ బిడ్డా’.. అని ఎంకరేజ్ చేశారు. ఆమెనొక సక్సెస్‌ఫుల్ ఉమెన్‌గా నిలబెట్టారు. ఆమెనే ఐవోసీ తొలి మహిళా అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీ.

దిశ, ఫీచర్స్: క్రిస్టీ కోవెంట్రీ 1983 సెప్టెంబర్ 16న జింబాబ్వేలోని హరారేలో జన్మించారు. పేరెంట్స్ లిన్, రాబ్ కోవెంట్రీ. ‘నా బిడ్డ పెద్ద క్రీడాకారిణి కావాలి’ అనేది తల్లి కలనట. క్రిస్టీకి తొమ్మిదేళ్లప్పుడే ఒలింపిక్ గోల్డ్ మెడల్ సాధిస్తానని తల్లితో చెప్పిందట. కానీ అమ్మాయిలు ఈత కొడితే బయట పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా ? అయినా పేరెంట్స్ సపోర్ట్‌తో స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకొని స్థానిక ఈత పోటీల్లో పాల్గొనేదట క్రిస్టీ కోవెంట్రీ.

7 ఒలింపిక్స్ పతకాలు

డొమినికన్ కాన్వెంట్ హైస్కూల్లో చదివిన క్రిస్టీ.. అమెరికాలోని అబర్న్ యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ చేసింది. యూనివర్సిటీలో నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్‌సీఏఏ) టైటిల్స్ గెలుచుకుంది. స్విమ్మింగ్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవడానికి అక్కడే పునాది పడింది. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో తొలిసారి పాల్గొన్నది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో 3 పతకాలు గెలిచింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 4 పతకాలను గెలిచింది. మొత్తం ఏడు ఒలింపిక్స్ పతకాలు సాధించి ఆఫ్రికా ఖండం నుంచి అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారిణిగా రికార్డు కొట్టింది.

రాజకీయాల్లోకి..

క్రిస్టీ కోవెంట్రీ 2013లో టైరోన్ సీవార్డ్‌ను పెండ్లి చేసుకుంది. క్రీడల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక క్రిస్టీ రాజకీయాల్లోకి వెళ్లింది. 2018లో జింబాబ్వే యువత.. క్రీడలు.. కళల శాఖమంత్రిగా పనిచేసింది. ఆమె నాయకత్వంలో జింబాబ్వే క్రీడా విధానాలు బలోపేతం అయ్యాయి. ఒకవైపు క్రీడా స్ఫూర్తి.. ఇంకోవైపు రాజకీయాలు.. మరోవైపు దేశభక్తితో సంపూర్ణ నాయకురాలిగా ఆమె గుర్తింపు సాధించింది.

సాంప్రదాయ పెండ్లి

క్రిస్టీకి జింబాబ్వే సాంప్రదాయాలంటే ఎంతో గౌరవం. ఆమె పెండ్లిల ‘లోబోలా’ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ‘లోబోలా’అంటే వధూ మూల్యం. వరుడి ఇంటివాళ్లు ఒక ఆవు, రెండు కోళ్లను క్రిస్టీ తండ్రి రాబ్‌కు చెల్లించారు. 2015లో భర్తతో కలిసి ‘క్రిస్టీ కోవెంట్రీ అకాడమీ’ని స్థాపించింది. దీని ద్వారా ఈతలో శిక్షణ ఇస్తున్నారు. "హీరోస్" అనే కార్యక్రమం ద్వారా వెనకబడిన తరగతుల పిల్లలకు ఉచిత క్రీడా కార్యక్రమాలు అందిస్తున్నారు.

ఐవోసీ అధ్యక్షురాలిగా

2013లో ఐవోసీ అథ్లెట్ కమిషన్ లో సభ్యురాలిగా ఎన్నికైన క్రిస్టీ క్రీడాకారుల హక్కులను కాపాడటానికి కృషి చేసింది. ఆమెలోని నాయకత్వ లక్షణాలు.. క్రీడా అనుభవాన్ని గుర్తించిన సంస్థ 2025 మార్చి 20న ఐవోసీ అధ్యక్షురాలిగా నియమించింది. 1894లో ఐవోసీ స్థాపించినప్పటి నుంచి అంతా పురుషులే అధ్యక్షులుగా ఉన్నారు. తొలిసారిగా మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్రలో చెరగని ముద్ర వేసింది క్రిస్టీ. ఇది క్రీడా పరిపాలనలో ఆమె సాధించిన గొప్ప విజయం.

Advertisement
Next Story

Most Viewed