IND vs WI 1st Test: విండీస్‌తో టెస్టు పోరుకు భారత్​ రె'ఢీ'.. టాస్ గెలిచిన విండీస్..

by Vinod kumar |   ( Updated:2023-07-12 14:05:41.0  )
IND vs WI 1st Test: విండీస్‌తో టెస్టు పోరుకు భారత్​ రెఢీ.. టాస్ గెలిచిన విండీస్..
X

దిశ, వెబ్‌డెస్క్: డొమినికా వేదికగా విండీస్-భారత్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తరఫున ఇషాన్‌ కిషన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో అతడు వికెట్‌ కీపర్‌గా వ్యవహరించనుండగా.. తెలుగు క్రికెటర్‌ కేఎస్‌ భరత్‌కు మొండిచేయి ఎదురైంది. చివరి సారిగా 2019లో విండీస్‌ పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత వెస్టిండీస్‌తో ​టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. గతేడాది భారత్‌కు విండీస్‌ వచ్చినప్పటికీ టెస్టు సిరీస్ ​మాత్రం ఆడలేదు.

అయితే ఈ సారి రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్‌ఇండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో యువ ప్లేయర్ యశస్వి జైశ్వాల్ టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసి జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్.. టెస్ట్ అరంగేట్రం చేయబోతున్నాడు. వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న మొదటి టెస్టులో అతడు ఓపెనర్‌గా దిగబోతున్నాడు. ఈ విషయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దీంతో హిట్ మ్యాన్-యశస్వి కలిసి ఓపెనర్లుగా బరిలో దిగబోతున్నారు.

డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్‌లో స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్న యశస్వికి.. అప్పుడు ఆడే ఛాన్స్ దక్కలేదు. కానీ, ఈ సారి విండీస్ ​పర్యటనకు ఎంపికవ్వడంతో పాటు మొదటి టెస్టులోనే ఆడే అవకాశం దక్కించుకోవడం విశేషం. 2021లో ఆస్ట్రేలియాపై టెస్ట్ అరంగేట్రం చేసిన శుభమన్​గిల్.. అప్పటి నుంచి ఓపెనర్​గానే బరిలో దిగుతున్నాడు. అయితే ఈ సారి యశస్వి ఓపెనర్‌గా ఎంట్రీ ఇవ్వడంతో.. గిల్​మూడో స్థానంలో ఆడనున్నట్లు హిట్​మ్యాన్​పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నట్లు రోహిత్ చెప్పాడు.

భారత్​పైచేయి..

గత 21 ఏళ్లుగా ఇరు దేశాల జట్ల మధ్య మొత్తం ఎనిమిది సిరీస్‌లు జరిగాయి. వీటన్నింటిలో టీమ్‌ఇండియానే విజయం సాధించడం విశేషం. చివరిసారిగా భారత్‌పై వెస్టిండీస్‌ 2001/2002 సీజన్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఒక్కసారి కూడా విండీస్..​భారత్‌పై పైచేయి సాధించలేకపోయింది. ఇప్పటివరకు ఇరు జట్లూ కలిపి మొత్తం 98 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. వీటిల్లో భారత్ (22), విండీస్‌ (30) విజయాలతో ఆధిపత్యంలో ఉంది. కరేబియన్‌ మైదానంలో 51 మ్యాచుల్లో తలపడగా.. విండీస్‌ 16 విజయాలు, భారత్ 9 విజయాలను నమోదు చేసింది. మరో 26 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. సిరీస్‌ల గణంకాల ప్రకారం.. విండీస్‌-భారత్‌ జట్ల మధ్య 24 టెస్ట్​ సిరీస్‌లు జరిగాయి. ఇందులో 12 సిరీస్‌లను వెస్టిండీస్‌ సొంతం చేసుకోగా.. భారత్ 10 సిరీస్‌లను గెలుచుకుంది. మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (w), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI):

క్రైగ్ బ్రాత్‌వైట్ (సి), టాగెనరైన్ చందర్‌పాల్, రేమన్ రీఫర్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (w), జాసన్ హోల్డర్, రహ్కీమ్ కార్న్‌వాల్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్

Advertisement

Next Story

Most Viewed