బండి సంజయ్ కు KTR లీగల్ నోటీసులు

by karthikeya |   ( Updated:2024-10-23 07:37:36.0  )
బండి సంజయ్ కు KTR లీగల్ నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, అపోజిషన్ పార్టీల నేతలకు లీగల్ నోటీసులు పంపడంలో తెగ బిజీ అయిపోయారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆయనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో నొచ్చుకున్న కేటీఆర్.. ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తాజాగా బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కి కూడా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. బండి సంజయ్ తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని, వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు.

బండి సంజయ్ ఏమన్నారు..?

ఈ నెల 19 వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యల పైనే సీరియస్ అయిన కేటీఆర్.. బండి సంజయ్ తనపై నిరాధరమైన ఆరోపణలు చేశారని, ఆయన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని పేర్కొంటూ కేటీఆర్ నోటీసులు జారీ చేశారు.

కేటీఆర్ ఫైర్:

తనను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశతంతోనే బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, తాను డ్రగ్స్ తీసుకుంటానని, ఫోన్ ట్యాపింగ్ చేశానని, కేసుల నుంచి తప్పించుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా కలిసిపోయానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే నిరూపించాలని సవాల్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు కాబట్టి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

కేంద్రమంత్రిగా బాధ్యతయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ లాంటి వ్యక్తి చేసే ఆరోపణలను ప్రజలు నమ్మే అవకాశం ఉందని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం తనపై బురద చల్లాలన్న దురుద్దేశం, తమ పార్టీ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లోగా క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ తన లీగల్ నోటీసులో హెచ్చరించారు.

Read More: Bandi Sanjay : కేటీఆర్ కాస్కో.. నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. లీగల్ నోటీసులపై బండి సంజయ్

Advertisement

Next Story