Ind Vs NZ: ముంబై టెస్ట్‌లో భారత్ ఘోర పరాజయం.. సిరీస్‌ను క్లీన్‌‌స్వీప్ చేసిన కివీస్

by Shiva |   ( Updated:2024-11-03 08:03:49.0  )
Ind Vs NZ: ముంబై టెస్ట్‌లో భారత్ ఘోర పరాజయం.. సిరీస్‌ను క్లీన్‌‌స్వీప్ చేసిన కివీస్
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై టెస్ట్‌లో భారత్ (India) ఘోర పరాజయాన్ని చవిచూసింది. 25 పరుగులు తేడాతో న్యూజిలాండ్ (New Zealand) జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. కివీస్ (Kiwis) ఇచ్చిన 147 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా (Team India) ఛేదించలేక 121 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్లలో నలుగురు సింగిల్ డిజిట్‌కే అవుటయ్యారు. రిషభ్ పంత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి జట్టును విజయం అంచుల దాకా తీసుకొచ్చినా.. మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయారు. దాదాపు 24 ఏళ్ల తరువాత స్వదేశంలో భారత జట్టు వైట్‌వాష్‌కు గురైంది.

అంతకు ముందు 171 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్ (Kiwis) మరో మూడు పరుగు జోడించి 174 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. భారత్ (Team India) ముందు ఆ జట్టు 147 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కానీ, కివీస్ బౌలర్ల ధాటికి భారత టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (Yashaswi Jaiswal) (5) పరుగులు, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohith Sharma) (11) పరుగులు చేసి వెంటవెంటనే అవుటయ్యారు.

అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ (Subhman Gill) (1), విరాట్ కోహ్లీ (Virat Kohli) (1) కూడా అదే బాటలో పెవీలియన్ చేరారు. ఇక మొదటి టెస్ట్ సెంచరీ హీరో, టెస్ట్ స్పెషలిస్ట్ సర్ఫరాజ్ ఖాన్ (Surfaraz Khan) (1) పరుగు మాత్రమే చేసి క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అదేవిధంగా రవీంద్ర జడేజా 22 బంతుల్లో 6 పరుగులు చేసి ఏజాజ్ పటేల్ బౌలింగ్‌లో పెవీలియన్ చేరాడు. అందరు బ్యాట్స్‌మెన్లు క్యూ కడుతున్నా.. రిషభ్ పంత్ (Rishabh Panth) మాత్రం బ్యాటింగ్‌‌తో విరవిహారం చేశాడు. టెస్ట్ మ్యాచ్‌ను వన్డే స్టైల్లో ఆడుతూ.. భారీ షాట్లతో విరుచుపడ్డాడు. ఈ క్రమంలోనే అతడు 57 బంతుల్లో 64 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం వచ్చి టెయిలెండర్లు అశ్విన్, సుందర్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్‌లు చేతులెత్తేయడంతో భారత్ 121 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కివీస్ 25 పరుగుల తేడాతో విజయం సాధించి.. సీరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. న్యూజిలాండ్ (New Zealand) బౌలర్లలో స్పిన్నర్ ఎజాజ్ పటేల్ (Azaz Patel) 6 వికెట్లు, మ్యాట్ హెన్రీ (Matt Henry), గ్లెన్ ఫిలిప్స్ (Glenn Philips) 3 వికెట్లు నేలకూల్చారు.

Advertisement

Next Story