నేను అలాంటి కోచ్‌ను కాదు.. కోచింగ్‌కు కొత్త అర్థం చెప్పిన ద్రవిడ్

by Harish |
నేను అలాంటి కోచ్‌ను కాదు.. కోచింగ్‌కు కొత్త అర్థం చెప్పిన ద్రవిడ్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ టైటిల్‌తో టీమ్ ఇండియా హెడ్ కోచ్‌ పదవికి రాహుల్ ద్రవిడ్‌ ఘనంగా ముగింపు పలికాడు. టీ20 ప్రపంచకప్ ఫైనలే అతనికి ప్రధాన కోచ్‌గా చివరి మ్యాచ్. తాజాగా ద్రవిడ్‌కు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. కోచ్‌గా జట్టుతో ద్రవిడ్ సమయం, అతని విజయాలు, నిరాశలతో కూడిన వీడియోను ‘ది ద్రవిడ్.. ఫేర్‌ వాల్’ పేరిట ఎక్స్‌లో పోస్టు చేసింది.

ఆ వీడియోలో ద్రవిడ్ మాట్లాడుతూ.. పలు విషయాలు వెల్లడించాడు. తన దృష్టిలో కోచింగ్ అంటే క్రికెట్ కోచింగ్ మాత్రమే కాదని, విజయానికి అనుకూలమైన వాతావరణాన్ని నిర్మించడమని చెప్పాడు. ‘కొనసాగించడాన్ని ఇష్టపడే వ్యక్తిని నేను. చాలా విషయాలను తగ్గించడం, మార్చడం నాకు ఇష్టం లేదు. అలా చేయడం ద్వారా అస్థిరతను సృష్టించడమే కాకుండా మంచి వాతావరణాన్ని నిర్మించలేమనేది నా నమ్మకం. మ్యాచ్‌లను గెలవడమే లక్ష్యం. కానీ, గెలవడానికి ఏం చేయాలి?. మరిన్ని మ్యాచ్‌లను ఎలా గెలవాలి?. అందుకు ఆటగాళ్లను ఎలా సిద్ధం చేస్తున్నాం? అని ఆలోచించడం నాకు ఇష్టం. ’ అని తెలిపాడు.

ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్, కోహ్లీలపై ప్రశంసలు కురిపించాడు. ‘రోహిత్‌ చిన్నప్పటి నుంచి తెలుసు. భారత క్రికెట్‌లో అతను వ్యక్తిగా, నాయకుడిగా ఎదిగాడు. టీ20 ప్రపంచకప్ గెలవడానికి అతను అర్హుడు. నా కెప్టెన్సీలో విరాట్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అప్పుడే అతని గురించి తెలిసింది. వృత్తి నైపుణ్యాలు ప్రదర్శించడం, ఇంకా మెరుగవ్వాలనే అతని కోరిక చూడటానికి నాకు ఆసక్తిగా ఉంటుంది.’ అని చెప్పాడు.

అలాగే, కోచ్‌గా తన తొలినాళ్ల విషయాలను పంచుకున్నాడు. కొవిడ్-19 సమయంలో బాధ్యతలు చేపట్టడం ద్వారా తనకు సవాళ్లు ఎదురైనట్టు చెప్పాడు. ‘అప్పుడు కొవిడ్ ప్రభావం తగ్గుతోంది. మరోవైపు, ఆటగాళ్ల అన్ని ఫార్మాట్ల పనిభారాన్ని చూసుకోవాల్సి వచ్చింది. కొందరు గాయపడ్డారు. తొలి 8-10 నెలల్లో 5-6 కెప్టెన్లతో పనిచేయాల్సి వచ్చింది. ఇది నేను ఊహించలేదు. అలా జరిగిపోయింది.’అని గుర్తు చేసుకున్నాడు. కొవిడ్ ద్వారా కొంత మంచే జరిగిందని, చాలా మంది యువ ఆటగాళ్లు భారత జట్టులోకి వచ్చారని చెప్పాడు. ‘కొవిడ్ ముగిసిన తర్వాత మేము ఎక్కువ క్రికెట్ ఆడాల్సి వచ్చింది. అందుకే, ఒకే సమయంలో రెండు జట్లతో ఆడాం. గత రెండున్నర ఏళ్లలో ఎంతో మంది యువకులకు అవకాశాలు దక్కాయి.’ అని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed