- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Aman Sehrawat :తల్లిదండ్రుల కల కోసం.. ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన అమన్ సక్సెస్ స్టోరీ ఇదే
దిశ, స్పోర్ట్స్ : అమన్ సెహ్రావత్.. పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచే వరకు పెద్దగా ఎవరికి తెలియని పేరు. కానీ, అప్పటికే రెజ్లింగ్‌లో తన పట్టు బిగించాడని కొద్ది మందికే తెలుసు. 11 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన అతను.. విశ్వక్రీడల్లో దేశ కీర్తిపతాక ఎగరవేయడానికి ఎన్నో సవాళ్లను దాటాడు. రెజ్లర్ కావాలన్న తన తల్లిదండ్రుల కల నిజం చేయడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. తల్లిదండ్రుల స్వప్నాన్ని నిజం చేయడమే కాకుండా దేశానికి ఒలింపిక్ మెడల్ అందించిన అమన్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. 21 ఏళ్ల అమన్ విశ్వక్రీడల్లో దేశానికి పతకం అందించిన యంగెస్ట్ అథ్లెట్‌గా నిలిచాడు.
అమన్ సెహ్రావత్ హర్యానాలోని బిరోహర్ గ్రామంలో జన్మించాడు. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో దిగ్గజ రెజ్లర్ సుశీల్ కుమార్ రజతం గెలవడంతో స్ఫూర్తి పొందిన అతను రెజ్లింగ్‌పై మక్కువ పెంచుకున్నాడు. తన తండ్రి కూడా అతన్ని ఓ రెజ్లర్‌గా చూడాలనుకున్నాడు. అయితే, 11 ఏళ్ల వయసులో అమన్ తన తల్లిని కోల్పోయాడు. ఆ బాధ నుంచి అమన్‌ను బయటకు తీసుకరావాడనికి తండ్రి అతన్ని రెజ్లింగ్ అకాడమీకి పంపించాడు. అయితే, తల్లిని కోల్పోయిన కొద్ది రోజులకే తండ్రి కూడా కన్నుమూశాడు. 11 ఏళ్ల వయసులోనే అమన్ అనాథ అయ్యాడు. దీంతో అమన్, అతని సోదరి వాళ్ల అంకుల్ ఇంటికి వెళ్లారు.తల్లిదండ్రులను కోల్పోయిన బాధ నుంచి బయటకు రావడానికి అమన్‌కు చాలా రోజులు పట్టింది.
ఛత్రసాల్ స్టేడియంలోనే అంతా..
సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్ పూనియా, రవి దహియా వంటి ఒలింపిక్ మెడలిస్ట్‌ను సృష్టించిన ఛత్రసాల్ స్టేడియంలోనే అమన్ రాటుదేలాడు. కోచ్ లలిత్ కుమార్ శిక్షణలో మెరుగయ్యాడు. ఛత్రసాల్ స్టేడియంలోనే ఉండేవాడు. రాత్రింబవళ్లు లక్ష్యం కోసమే సాధన చేశాడు. ఒక సందర్భంలో కోచ్ లలిత్..‘అమన్ రెజ్లింగ్‌ను ఎంచుకోలేదు. రెజ్లింగే అతన్ని ఎంచుకుంది’ అని చెప్పాడు. గతేడాది ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచే వరకు అతను ఛత్రసాల్ స్టేడియంలోనే ఉండేవాడు. ఆ తర్వాతే అతను కిచెన్‌తోకూడిన ఓ రూంను తీసుకున్నాడు.
కష్టపడ్డాడు.. సాధించాడు
అమన్ విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. రెజ్లర్ కావాలన్న కల కోసం ఎంతో కష్టపడ్డాడు. కోచ్ లలిత్ కుమార్ శిక్షణలో రాటు దేలిన అతను 2021లో తొలిసారిగా నేషనల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాతి ఏడాది 2022లో అండర్-23 ఏషియన్ చాంపియన్, అండర్-23 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. అండర్-23 వరల్డ్ చాంపియన్‌షిప్ గోల్డ్ సాధించిన తొలి భారత రెజ్లర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతేడాది ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన అతను.. అదే ఏడాది ఆసియా క్రీడల్లో 57 కేజీల కేటగిరీలో కాంస్యం సాధించాడు. ఈ ఏడాది ఇస్తాంబుల్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నీలో ఒలింపిక్స్ బెర్త్ సాధించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ తరపున పాల్గొన్న ఏకైక పురుష రెజ్లర్ అతనే కావడం విశేషం. తొలి విశ్వక్రీడల్లోనే సంచలన ప్రదర్శనతోపాటు కీలక బౌట్లలో ఒత్తిడిని అధిగమించిన అతను కంచు పట్టు పట్టాడు.
‘నేను రెజ్లర్ కావాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ కోరుకునేవారు. వాళ్లకు ఒలింపిక్స్ గురించి ఏమాత్రం తెలియదు. కానీ, నేను రెజ్లర్ కావాలనుకున్నారు. ఈ పతకం నా తల్లిదండ్రులకు, దేశానికి అంకితం’
-అమన్