Inzamam ul Haq: పాకిస్తాన్‌ కీలక నిర్ణయం.. చీఫ్‌ సెలెక్టర్‌గా మాజీ కెప్టెన్..

by Vinod kumar |
Inzamam ul Haq: పాకిస్తాన్‌ కీలక నిర్ణయం.. చీఫ్‌ సెలెక్టర్‌గా మాజీ కెప్టెన్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఉల్‌ హాక్‌.. పాక్ జాతీయ పురు‌షుల క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌గా నియమించబడ్డాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) ధృవీకరించింది. గత వారమే పాకిస్తాన్‌ క్రికెట్ టెక్నికల్ కమిటీలో చేరిన ఇంజమామ్.. తాజాగా చీఫ్ సెలెక్టర్‌గానూ బాధ్యతలు చేపట్టినట్లు పీసీబీ వెల్లడించింది. ఇంజమామ్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ త్వరలో పాక్‌ ఆడనున్న ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌, ఆసియా కప్‌కు జట్లను ప్రకటిస్తుందని పీసీబీ ప్రతినిధి తెలిపారు. సెలెక్షన్‌ కమిటీలో ఇంజమామ్‌తో పాటు టీమ్‌ డైరెక్టర్‌ మిక్కీ ఆర్థర్‌, హెడ్‌కోచ్‌ బ్రాడ్‌బర్న్‌ ఉంటారని, ఇంజమామ్‌ వీరి ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకుని జట్టును ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌, ఆసియా కప్‌లతో పాటు భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు కూడా జట్టును ప్రకటిస్తారని తెలిపారు. మాజీ ఆటగాడు మిస్బా ఉల్‌ హాక్‌ నేతృత్వంలోని పీసీబీ క్రికెట్ టెక్నికల్ కమిటీ ఇంజమామ్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీని ప్రతిపాదించి, ఆమోదించిందని వెల్లడించారు. ఇంజమామ్‌ ఎంపికకు పీసీబీ చైర్మన్‌ జకా అష్రాఫ్‌ కూడా అమోద ముద్ర వేసారని అన్నారు. ఇంజమామ్ గతంలో 2016 నుండి 2019 వరకు పాక్‌ నేషనల్‌ మెన్స్‌ టీమ్‌ చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరించాడు. అతని ఆధ్వర్యంలో ఎంపిక చేసిన జట్టు 2017లో సర్ఫరాజ్ అహ్మద్ నాయకత్వంలో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది.

Advertisement

Next Story

Most Viewed