‘కడా’కు సొబగులు.. అందరి దృష్టి కొడంగల్ నియోజకవర్గం వైపే

by Shiva |
‘కడా’కు సొబగులు.. అందరి దృష్టి కొడంగల్ నియోజకవర్గం వైపే
X

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో/కోస్గి: కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడా)‌కి అభివృద్ధి సొబగలు అద్దేందుకు అధికారులు ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తరతరాలుగా అభివృద్ధిలో వెనుకబడి ఉన్న ఈ ప్రాంతం నుంచి రేవంత్‌రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా ఎంపికై.. సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో రాష్ట్రంలోని అందరి దృష్టి కొడంగల్ నియోజకవర్గం వైపే సాధించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతం అన్ని విధాల వెనుకబడి ఉండడం, స్వయానా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతాన్ని కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కడా)‌గా ప్రకటించిన విషయం పాఠకులకు విదితమే.

కొడంగల్ ప్రాంతాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయమని సీఎం అధికారులను అప్పట్లో ఆదేశించడంతో.. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం మొదటి విడతగా రూ.120 కోట్లు అవసరం అవుతాయని నివేదికను పంపారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వము ముందుగా రూ.15 కోట్లను విడుదల చేసింది. ప్రస్తుతం మరో రూ.43.75 కోట్లను కూడా విడుదల చేసింది. ‘కడా’ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలు.. అంగన్వాడీ కేంద్రాలు

‘కడా’ అభివృద్ధికి గాను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఉన్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఆ నిధులను ఖర్చు చేయనున్నట్లు సమాచారం. అవసరమైన చోట్ల పాఠశాలల అదనపు తరగతి గదులు, ప్రహరీ నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని వసతులు ఉండే విధంగా నిర్మించనున్నారు.

దుద్యాలలో ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్

ఆలస్యంగా మండల కేంద్రంగా ఎంపికైన దుద్యాలలో రాష్ట్రంలో మోడల్‌గా ఉండేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ మండల కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఎంపీడీవో, తహసీల్దార్, తదితర ముఖ్య కార్యాలయాలు అన్ని ఒకేచోట ఉండే విధంగా మండల కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. ఇందుకోసం దాదాపుగా రూ.15 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు అంచనా. ఈ మండల కార్యాలయ నిర్మాణము పూర్తి అయితే మండల ప్రజలకు ఒకే దగ్గర సేవలు అందబాటులోకి రానున్నాయి.

మిగతా అభివృద్ధి పనులు కూడా

‘కడా’ నిధులతోనే కాకుండా ఇతర నిధులతోనూ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది. రోడ్లు, తాగు నీటి సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నిధులు వివిధ శాఖల ద్వారా విడుదల అవుతున్నాయి. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆ ప్రాంతం అంతా తాగునీరు, సాగునీరు సమస్యలు లేకుండా అన్ని విధాల అభివృద్ధి చెందడానికి అవకాశాలు లభిస్తాయి.

Advertisement

Next Story

Most Viewed