ఇవాళే దక్షిణ కొరియాకు మంత్రి పొంగులేటి బృందం.. ఆ ఐదుగురు డుమ్మా కొట్టే అవకాశం!

by Gantepaka Srikanth |
ఇవాళే దక్షిణ కొరియాకు మంత్రి పొంగులేటి బృందం.. ఆ ఐదుగురు డుమ్మా కొట్టే అవకాశం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవం కోసం మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులతో కూడిన 25 మంది బృందం ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకూ దక్షిణ కొరియాలోని సియోల్‌ నగరాన్ని సందర్శించనున్నది. అక్కడి రివర్ ఫ్రంట్ అభివృద్ధిని సభ్యులు క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. సియోల్‌ సందర్శనకు వెళ్లే మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల పేర్లను ప్రభుత్వం ఇప్పటికే ఎంపిక చేసింది. ఎంఐఎం ఎమ్మెల్యేలు మహ్మద్ ముబీన్, కౌసర్ మోహినుద్దీన్, మీర్ జుల్పీకర్ అలీ, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల ఉండగా.. బీఆర్ఎస్ నుంచి టి.ప్రకాష్ గౌడ్, కాలేరు వెంకటేష్, డి. సుధీర్‌రెడ్డి, సీహెచ్.మల్లారెడ్డి, బీజేపీ నుంచి రాజాసింగ్ వెళ్లే వారిలో ఉన్నారు.

ఆ ఐదుగురు డుమ్మా

ప్రభుత్వం ఎంపిక చేసిన 25 మందిలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఐదుగురు సభ్యులున్నారు. వీరి హాజరు అనుమానంగానే కనిపిస్తున్నది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే మూసీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ ఏకంగా తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రాజెక్టు ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు సియోల్ టూర్‌కు వెళ్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒక వెళ్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టే అవుతుందని పలువురు పేర్కొ్ంటున్నారు. సియోల్ వెళ్లారంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్టేనని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇక బీజేపీ సభ్యులు రాజాసింగ్ సైతం వెళ్లడం అనుమానంగానే కనిపిస్తున్నది.

సర్కారుకు మద్దతుగా మజ్లీస్ పార్టీ

హైడ్రా కార్యక్రమాలు, మూసీ ఆక్రమణల కూల్చివేత కార్యక్రమాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎం కాస్త చల్లబడిందనే చెప్పాలి. ఇందుకు శుక్రవారం ప్రజాభవన్‌లో మూసీ బాధితులకు రుణాల చెక్కుల పంపిణీ ప్రోగ్రామ్‌లో ఎమ్మెల్యేలు బలాల, కౌసర్ మొహినుద్దీన్ వ్యవహారశైలినే నిదర్శనమని చెప్పొచ్చు. మలక్‌పేట్, కార్వాన్, చార్మినార్, బహుదుర్‌పుర ప్రాంతాల్లో మైనార్టీలను ఒప్పించడంలో వీరి పాత్ర కీలకంగా ఉంది. హైడ్రా విషయంలో ఎలా ఉన్నా మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి సహకరించాలనే వైఖరితో ఉన్నట్టు స్పష్టమవుతోంది. దీంతో ఎంఐఎం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సియోల్ టూర్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed