టాప్ సీడ్లుగా అల్కారాజ్, ఇగా.. రేపు తీయనున్న వింబుల్డన్ డ్రా

by Vinod kumar |
టాప్ సీడ్లుగా అల్కారాజ్, ఇగా.. రేపు తీయనున్న వింబుల్డన్ డ్రా
X

లండన్: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టోర్నమెంట్‌లో పురుషుల, మహిళల సింగిల్స్ టాప్ సీడ్లుగా కార్లోస్ అల్కారాజ్, ఇగా స్వియాటెక్ బరిలోకి దిగనున్నారు. వరుసగా నాలుగుసార్లు వింబుల్డన్ విజేతగా నిలవడంతో పాటు ఈ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను ఏడుసార్లు కైవసం చేసుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ నొవాక్ జకోవిచ్ రెండోసీడ్‌కే పరిమితమయ్యాడు. స్పెయిన్‌కు చెందిన అల్కారాజ్ ఆదివారం క్వీన్స్ క్లబ్‌లో జరిగిన గ్రాస్ కోర్టు ట్యూన్ టోర్నమెంట్‌ను గెలుచుకోవడంతో జకోవిచ్‌ను వెనక్కి నెట్టి పురుషుల సింగిల్స్ టాప్ సీడ్‌కు దూసుకెళ్లాడు.

జూన్ 11వ తేదీన ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీ సాధించి 23వ గ్రాండ్ శ్లామ్ టైటిల్ సొంతం చేసుకున్న తర్వాత జకోవిచ్ మ్యాచ్‌లు ఆడకపోవడంతో రెండవ స్థానానికి పడిపోయాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్ అథ్లెట్ల గత ఏటీపీ, డబ్ల్యూటీఏ పాయింట్లను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో జొకోవిచ్ గతేడాది సాధించిన విజయాల నుంచి లబ్ధి పొందలేకపోయాడు.

ఈ ఏడాది ఆటతీరును బట్టే సీడింగ్ కేటాయించారు. రష్యాకు చెందిన డానిల్ మెద్వెదేవ్ పురుషుల సింగిల్స్‌లో మూడో ర్యాంకు సాధించాడు. బెలారస్‌కు చెందిన అరానీ సబలెంకా మహిళల సింగిల్స్‌లో 2వ సీడ్ దక్కించుకుంది. సింగిల్స్, డబుల్స్ మ్యాచ్‌లకు సంబంధించిన డ్రాను శుక్రవారం తీస్తారు. స్వియాటెక్ గతేడాది ఏప్రిల్ నుంచి మహిళల సింగిల్స్‌లో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతోంది. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీ సాధించిన ఆమె ఖాతాలో నాలుగు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు ఉన్నాయి. 2022 వింబుల్డన్ విజేత ఎలెనా రిబకినా మూడో సీడ్‌గా బరిలోకి దిగనుంది.

Advertisement

Next Story

Most Viewed