బుమ్రాకు అరుదైన గౌరవం.. ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక

by Harish |
బుమ్రాకు అరుదైన గౌరవం.. ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు అరుదైన గౌరవం దక్కింది. ‘టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్’కు క్రికెట్ ఆస్ట్రేలియా బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం ‘బెస్ట్ టెస్టు ఎలెవన్-2024’ను ప్రకటించింది. ఈ ఏడాది టెస్టుల్లో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 13 మ్యాచ్‌ల్లో 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను 30 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ఇద్దరు భారత క్రికెటర్లకే చోటు దక్కింది. బుమ్రాతోపాటు యశస్వి జైశ్వాల్ స్థానం సంపాదించాడు. జైశ్వాల్ 15 మ్యాచ్‌ల్లో 1,478 రన్స్ చేశాడు. అందులో మూడు శతకాలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు స్థానం దక్కలేదు. మరోవైపు, ఆసిస్ కెప్టెన్ కమిన్స్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేయకపోవడం గమనార్హం. అలాగే, స్టార్క్,స్పిన్నర్ నాథన్ లియోన్‌లను కూడా విస్మరించింది. ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు ప్లేయర్లను ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్ నుంచి ఇద్దరు చొప్పున ఆటగాళ్లకు, శ్రీలంక, దక్షిణాఫ్రికా నుంచి ఒక్కొక్కరికి జట్టులో స్థానం ఇచ్చింది.

క్రికెట్ ఆస్ట్రేలియా ‘టెస్టు ఎలెవన్-2024’ జట్టు ఇదే

యశస్వి జైశ్వాల్, బెన్ డక్కెట్(ఇంగ్లాండ్), జోరూట్(ఇంగ్లాండ్), రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), హ్యారీ బ్రూక్(ఇంగ్లాండ్), కమింద్ మెండిస్(శ్రీలంక), అలెక్స్ కేరీ(ఆస్ట్రేలియా), మాట్ హెన్రీ(న్యూజిలాండ్), బుమ్రా(కెప్టెన్), హేజిల్‌వుడ్(ఆస్ట్రేలియా), కేశవ్ మహరాజ్(సౌతాఫ్రికా)


Advertisement

Next Story