Ajit Agarkar: చీఫ్ సెలెక్ట‌ర్ రేసులో టీమిండియా మాజీ పేసర్..!

by Vinod kumar |
Ajit Agarkar: చీఫ్ సెలెక్ట‌ర్ రేసులో టీమిండియా మాజీ పేసర్..!
X

న్యూఢిల్లీ : టీమ్ ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ భారత పురుషుల క్రికెట్ సెలెక్షన్ కమిటీకి చీఫ్‌‌గా నియామకమయ్యే అవకాశాలు ఉన్నాయి. మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం సెలెక్టర్ శివ్ సుందర్ దాస్ తాత్కాలికంగా ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇటీవల బీసీసీఐ ఖాళీగా ఉన్న సెలెక్టర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. నేటితో గడువు ముగియనుంది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) త్వరలోనే దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. అయితే, ఆ స్థానం కోసం అజిత్ అగార్కర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే, అతనికే చీఫ్ సెలెక్టర్ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. ఆటగాడిగా సుదీర్ఘ అనుభవం కలిగిన అజిత్ అగార్కర్ పేరు దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

కొంతకాలంగా ఆటగాళ్ల ఎంపికపై సెలెక్షన్ కమిటీ విమర్శలు ఎదుర్కొంటుంది. వరుసగా ఐసీసీ ఈవెంట్లలో టీమ్ ఇండియా నిరాశపర్చడం కూడా సెలెక్షన్ కమిటీకి తలనొప్పిగా మారింది. ఇటీవల, వెండీస్ పర్యటనకు సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారాను పక్కనపెట్టడం కూడా చర్చనీయాంశమైంది. ప్రముఖ మీడియా సంస్థ చేసిన స్టింగ్ ఆపరేషన్‌ తర్వాత చేతన్ శర్మ చీఫ్ సెలెక్టర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సెలెక్షన్ కమిటీకి ఎస్ఎస్ దాస్ తాత్కాలికంగా నేతృత్వం వహిస్తున్నారు. అయితే, ఈ ఏడాది ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీగా సెలెక్టర్ పోస్టును భర్తీ చేయడంతోపాటు చీఫ్ సెలెక్టర్‌ను నియమించాలని బీసీసీఐ కసరత్తులు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సెలెక్షన్ కమిటీలో సభ్యుడి భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

అయితే, మాజీ క్రికెటర్లలో సుదీర్ఘ అనుభవం ఉన్న వారిని చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలని బోర్డు భావిస్తున్నది. ‘టీమ్ మేనేజ్‌మెంట్‌తో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడే వ్యక్తిని సెలెక్టర్‌గా ఎంపిక చేయాలని సీఏసీ అనుకుంటోంది.’ అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మొదట మాజీ దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరు వినిపించింది. అయితే, ఆ వార్తలను సెహ్వాగ్ ఖండించాడు. అజిత్ అగార్కర్ రేసులో ముందున్నట్టు సమాచారం. అతను చివరిసారిగా కూడా చీఫ్ సెలెక్టర్ పదవి కోసం పోటీపడ్డాడు. అప్పుడు చేతన్ శర్మకే బోర్డు మొగ్గుచూపింది. ఇప్పుడు ఆ పోస్టుకు అగార్కరే సరిగ్గా సరిపోతాడని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అగార్కర్‌కు సుదీర్ఘ అనుభవం ఉండటంతోపాటు ప్రస్తుతం సెలెక్షన్ కమిటీలో ఉన్న సభ్యులతో పోల్చినా భారత్ తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది కూడా అగార్కరే. ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ నియామకం దాదాపు ఖాయమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌‌కు గుడ్ బై..

ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అజిత్ అగార్కర్ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, తాజాగా ఆ పోస్టుకు అతను రిజైన్ చేశాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం ట్విటర్ వేదికగా తెలిపింది. చీఫ్ సెలెక్టర్‌గా అతని నియామకం కన్ఫార్మ్ కావడంతోనే అగార్కర్ ఢిల్లీ జట్టుకు గుడ్ బై చెప్పాడని తెలుస్తోంది. బీసీసీఐ నిబంధల ప్రకారం.. బోర్డుకు సంబంధించిన కమిటీల్లో ఉండే వారు ఇతర బాధ్యతలు నిర్వర్తించడానికి లేదు. కాగా, అగార్కర్ 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో 42 మ్యాచ్‌లు ఆడాడు.

Advertisement

Next Story

Most Viewed