న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా.. సస్పెన్షన్‌పై ప్రమోద్ భగత్ పోస్టు

by Harish |
న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా.. సస్పెన్షన్‌పై ప్రమోద్ భగత్ పోస్టు
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ వేదికగా ఈ నెల ఆఖర్లో ప్రారంభమయ్యే పారాలింపిక్స్‌కు ముందు భారత్‌కు గట్టి షాక్ తగిలింది. టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, స్టార్ పారా షట్లర్ ప్రమోద్ భగత్‌పై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) వేటు వేసింది. అతనిపై 18 నెలలపాటు సస్పెన్షన్ విధించింది. ఈ విషయాన్ని బీడబ్ల్యూఎఫ్ మంగళవారం వెల్లడించింది.యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించినందు వల్లే అతనిపై చర్యలు తీసుకున్నట్టు బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 1 వరకు అతనిపై నిషేధం కొనసాగనుంది. దీంతో ప్రమోద్ పారిస్ పారాలింపిక్స్‌కు దూరంకానున్నాడు. కచ్చితంగా మెడల్ కం తెచ్చే అథ్లెట్ల జాబితాలో ఉన్న ప్రమోద్ దూరం కావడంతో భారత్ పతకానికి గండిపడింది.

ప్రమోద్ చేసిన తప్పేంటంటే?

బీడబ్ల్యూఎఫ్ యాంటీ డోపింగ్ నిబంధనల్లోని ఆర్టికల్ 2.4 ప్రకారం.. అథ్లెట్ 12 నెలల వ్యవధిలో మూడుసార్లు ఆచూకీ తెలపకపోవడం, డోపింగ్ టెస్టుకు హాజరుకాకపోవడం ఉల్లంఘన కిందకు వస్తుంది. ప్రమోద్ 12 నెలల వ్యవధిలో మూడు సార్లు డోపింగ్ టెస్టుకు హాజరుకాలేదని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్(కాస్) యాంటీ డోపింగ్ డివిజన్ మార్చి 1, 2024న ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో అతన్ని సస్పెండ్ చేశాం. దీన్ని సవాల్ చేస్తూ ఈ ఏడాది జూలైలో ప్రమోద్ కాస్ అప్పీల్స్ డివిజన్‌కు అప్పీల్ చేసుకున్నాడు. కాస్ అప్పీల్స్ డివిజన్ అతన్ని అప్పీలను తిరస్కరించింది. యాంటీ డోపింగ్ డివిజన్ నిర్ణయాన్ని సమర్థించింది.’ అని పేర్కొంది.

సాంకేతిక లోపం వల్లే : ప్రమోద్

తనపై విధించిన సస్పెన్షన్‌పై ప్రమోద్ భగత్ స్పందించాడు. యాంటీ డోపింగ్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని, సాంకేతిక లోపమే కారణమని తెలిపాడు. ‘సాంకేతిక సమస్యలను వివరిస్తూ సస్పెన్షన్‌పై అప్పీలు చేయడంలో నేను, నా టీమ్ విఫలమయ్యాం. వాడా, కాస్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. కానీ, ఎప్పుడూ చిత్తశుద్దితో పోటీపడే నాకు ఇది చాలా భావోద్వేగమైన సమయం. న్యాయం గెలుస్తుందని ఆశిస్తున్నా.’ అని ఎక్స్ వేదికగా పోస్టు చేశాడు.

Advertisement

Next Story