Asian Kabaddi Championship 2023: వరుసగా నాలుగో విజయం.. ఫైనల్‌కు భారత్

by Vinod kumar |
Asian Kabaddi Championship 2023: వరుసగా నాలుగో విజయం.. ఫైనల్‌కు భారత్
X

బుసాన్ : సౌత్ కొరియాలో జరుగుతున్న ఏషియన్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన నాలుగో గ్రూపు మ్యాచ్‌లో భారత్ 33-28 తేడాతో ఇరాన్‌పై గెలుపొందింది. దాంతో మరో గ్రూపు మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ తుది పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 16 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రారంభంలో ఇరుజట్లు పోటాపోటీగా కనిపించినా ఆ తర్వాత భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. అస్లామ్ ఇనామ్‌దార్, పవన్ సెహ్రావత్ మల్టీ పాయింట్స్‌తో జట్టును ఆధిక్యంలోకి తెచ్చారు.

అదే జోరు కనబర్చిన భారత్ ఫస్టాఫ్‌లో 19-9 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అనంతరం ఇరాన్ అనూహ్యం పుంజుకుని గట్టిపోటీనిచ్చింది. ఈ క్రమంలోనే భారత్‌ను తొలిసారి ఆలౌట్ చేసి పాయింట్ల మధ్య అంతరాన్ని 29-27కు తగ్గించింది. అయితే, సూపర్ టాకిల్‌తో పట్టుబిగించిన భారత్... ఆ తర్వాత అర్జున్ దేశ్వాల్ రెండు పాయింట్స్ తేవడంతో విజయం లాంఛనమైంది. టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా నాలుగో విజయం. పాయింట్స్ టేబుల్‌లో 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు నేరుగా ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఇక, నేడు జరిగే నామమాత్రపు చివరి గ్రూపు మ్యాచ్‌లో హాంకాంగ్‌తో భారత్ తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed