Asian Champions Trophy : భారత హాకీ జట్టు జోరు.. వరుసగా రెండో విజయం

by Harish |
Asian Champions Trophy : భారత హాకీ జట్టు జోరు.. వరుసగా రెండో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : చైనా వేదికగా జరుగుతున్న ఏషియన్ హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల హాకీ జట్టు జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చైనాను ఓడించిన భారత్.. రెండో మ్యాచ్‌లో జపాన్‌ను మట్టికరిపించింది. ఏకపక్షంగా సాగిన ఆటలో జపాన్‌ను 5-1 తేడాతో చిత్తు చేసింది. రెండు గోల్స్‌తో సుఖ్‌జీత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి నిమిషం వరకూ భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 2వ నిమిషంలోనే జట్టు ఖాతా తెరిచాడు సుఖ్‌‌జీత్. సంజయ్ అందించిన పాస్‌ను సుఖ్‌జీత్ గోల్‌గా మలిచాడు. ఆ తర్వాతి నిమిషంలోనే అభిషేక్ గోల్ చేయడంతో తొలి క్వార్టర్‌లోనే భారత్ 2-0తో లీడ్‌లోకి వెళ్లింది.

17వ నిమిషంలో సంజయ్ గోల్ చేయగా ఆధిక్యం 3-0కు పెరిగింది. మరోవైపు, భారత డిఫెండర్లు జపాన్ దాడులను తిప్పికొట్టారు. పెనాల్టీల రూపంలో ప్రత్యర్థికి దక్కిన అవకాశాలకు అడ్డుకట్టవేశారు. అయితే, మూడో క్వార్టర్‌లో జపాన్ తరపున మత్సుమోటో కజుమాసా ఏకైక గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-1కు తగ్గించాడు. కానీ, ఆ ఆనందం కాసేపే. భారత ఆటగాళ్లు ప్రత్యర్థిని నిలువరించారు. మరోవైపు, చివరి ఆరు నిమిషాల్లో 54వ నిమిషంలో ఉత్తమ్, 60వ నిమిషంలో సుఖ్‌జీత్ గోల్స్ చేయడంతో భారత్‌కు భారీ విజయం దక్కింది. ఈ నెల 11న టీమిండియా.. మలేషియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ బెర్త్ ఖాయమైనట్టే. ఆరు జట్లు పాల్గొనగా టాప్-4 జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి.

Advertisement

Next Story

Most Viewed