Ashes 2023: ఈ సారి 'బజ్‌బాల్ 2.0' చూపిస్తాం : ఇంగ్లండ్ హెడ్ కోచ్

by Vinod kumar |
Ashes 2023: ఈ సారి బజ్‌బాల్ 2.0 చూపిస్తాం : ఇంగ్లండ్ హెడ్ కోచ్
X

దిశ, వెబ్‌డెస్క్: Ashes 2023లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాషెస్ సిరీస్‌లో శుభారంభం దక్కకపోయినా.. తమ ప్లాన్‌లో ఎలాంటి మార్పు ఉండదని ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అన్నాడు. లార్ట్స్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో మరింత దూకుడుగా ఆడుతామని తెలిపాడు. బజ్‌బాల్ గేమ్‌తో దూకుడుగా ఆడిన ఇంగ్లండ్.. చివరకు అదే ఆటతీరుతో ఓటమిపాలైంది. మొదటి ఇన్నింగ్స్‌ను త్వరగా డిక్లేర్డ్ చేయడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడే క్రమంలో స్వల్ప స్కోరే నమోదు చేసింది. ఇంగ్లండ్ చేజేతులా పరాజయం పాలైందని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.

తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటతీరును మార్చుకొనే ప్రసక్తే లేదని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌ తెలపగా.. తాజాగా కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అవే కామెంట్స్ చేశాడు. మా ఆటతీరు ఇంకా దూకుడుగా ఉంటుంది. బజ్‌బాల్ 2.0 చూపించేందుకు ప్రయత్నిస్తాం. టెస్ట్ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మా ఆట తీరు ఉపయోగపడుతుంది. ఆసీస్ తమ ఆట తీరుతో విజయం సాధించింది. ఇక మేం కూడా మా ప్రణాళికలతో బరిలోకి దిగుతాం. దూకుడుగా ఆడటం వల్ల టెస్టు క్రికెట్‌ రసవత్తరంగా మారుతుంది. విజయం సాధించడానికి అవసరమైన అన్ని చేస్తాం. దూకుడుగా ఆడటం వల్ల టెస్టు మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులకు ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. జూన్ 28 నుంచి లార్డ్స్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.

Advertisement

Next Story

Most Viewed