Arshad Nadeem : పాక్ అథ్లెట్ నదీమ్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మామ.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

by Harish |
Arshad Nadeem : పాక్ అథ్లెట్ నదీమ్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మామ.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
X

దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత విభాగంలో పాక్‌కు తొలి బంగారు పతకం అందించిన అతనికి పలువురు భారీ కానుకలు ఇస్తున్నారు. తాజాగా నదీమ్‌ అతని మామయ్య ముహమ్మద్ నవాజ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నాడు. గేదెను బహుమతిగా ఇచ్చాడు. గేదెను గిఫ్ట్‌గా ఇవ్వడమేంటి? అని ఆశ్చర్యపోకండి. అందుకు కారణం ఉంది.

నదీమ్ స్వస్థలమైన పంజాబ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో గేదెను గౌరవ సూచకంగా భావిస్తారు. ఆ ప్రాంతాల్లో గేదెను బహుమతి ఇవ్వడం గొప్ప గౌరవంగా, విలువగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే నవాజ్ తన అల్లుడికి గేదెను గిఫ్ట్‌గా ఇచ్చాడు. స్థానిక మీడియాతో నవాజ్ మాట్లాడుతూ..‘ఇది మా గ్రామ సంప్రదాయాలు, విలువలను సూచిస్తుంది. నదీమ్ ప్రపంచ విజయం సాధించినప్పటికీ అతని మనసు మాత్రం అతని గ్రామంలోనే ఉంది. గేదెను బహుమతి ఇవ్వడం ద్వారా కేవలం మా గ్రామ సంప్రదాయాలను ప్రతిబింబించడమే కాకుండా నదీమ్ మూలాలకు, గ్రామంతో అతనికి ఉన్న అనుబంధానికి గుర్తింపు కూడా.’ అని వివరించాడు. కాగా, ఆరేళ్ల క్రితం నవాజ్ చిన్న కూతురు అయేషాను నదీమ్ పెళ్లి చేసుకున్నాడు. నదీమ్, అయేషా దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Advertisement

Next Story