- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. భారత్ విషయంలో అత్యంత కఠినంగా అమెరికా!

‘అక్రమంగా అమెరికాకు వస్తే ఇకపై ఇలాగే జరుగుతుంది’ అని అమెరికా భారతీయులను హెచ్చరించిందా? కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి 40గంటలపాటు టాయిలెట్‌కు కూడా అనుమతించకుండా సైనిక విమానంలో తీసుకురావడంలో అర్థం ఏమిటి? అమెరికా తీరుపై భారతీయుల గుండెలు మండుతున్నా ‘అది వారి విధానం. ఆ విషయంలో జోక్యం చేసుకోలేం’ అని మన విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అన్ని దేశాలతో అమెరికా అదే తీరుతో వ్యవహరించిందని కేంద్రమంత్రి చెప్తున్నా.. వాస్తవాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. కొన్ని దేశాలు అమెరికా బెదిరింపులకు ఎంతమాత్రం లొంగలేదు. తమ పౌరులను సైనిక విమానాల్లో తరలించడాన్ని ససేమిరా అన్నాయి. గగనతలంలోకి ఆ విమానాలు కూడా రాకుండా హెచ్చరికలు చేశాయి. దీంతో అగ్రదేశం అమెరికా.. చిన్న దేశాల పట్టుదలకు తలొగ్గి పౌర విమానాల్లో వారిని తరలించింది. కానీ, అమెరికా మాత్రం అత్యంత మిత్రదేశంగా చెప్పుకునే భారత్ విషయంలో మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరించింది. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్న సూత్రాన్ని పాటించింది. ఇంతకూ అమెరికాపై గర్జించిన ఆ చిన్నదేశాలు ఏవి? అమెరికా సైనిక విమానాలు పంజాబ్‌లోని అమృత్‌సర్‌కే ఎందుకు వచ్చాయి? అక్రమంగా వలస వెళ్లిన వారిపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైందేనా? ఈ అంశాలపై ‘దిశ’ ప్రత్యేక కథనం. - ఎస్పీ హరీశ్
అక్రమ వలసదారులపై అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. అక్రమ వలసలు ఆపేందుకు అమెరికా.. ఆయా దేశాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలా? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఒబామా ప్రభుత్వం నుంచి ట్రంప్ ముందు అధికారంలో ఉన్న బైడెన్ హయాంలోనూ అమెరికాకు అక్రమంగా వలసవెళ్లిన వారిని ఆయా దేశాలను పౌర విమానాల్లోనే డిపోర్టేషన్ చేసేవారు. కానీ, ట్రంప్ ప్రభుత్వం పౌర విమానాలకు బదులు సైనిక విమానాలు వినియోగించడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా సైనిక విమానాలు తమ దేశ గగనతలంలోకి రావడం.. ఆయా దేశాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అవుతుందని సైనిక నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజమైన హీరోలు బ్రెజిల్, కొలంబియా, మెక్సికో
అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో భారత్, హోండరస్, పెరు, గ్వాటెమాలకు అమెరికా పంపింది. అయితే, బ్రెజిల్, కొలంబియా, మెక్సికో దేశాలకు సైనిక విమానాల్లో అక్కడి దేశీయులను తీసుకు వెళ్లగా ఆ దేశాలు తీవ్రంగా స్పందించాయి. అమెరికా సైనిక విమానాలను గగనతలంలోకి కూడా అనుమతించలేదు. తమ పౌరులను గౌరవప్రదంగా తీసుకురావాల్సిందేనని కుండబద్దలు కొట్టాయి. గగనతలంపై చక్కర్లు కొట్టినా బెదరలేదు.. అనుమతి లేకున్నా దిగుతామని అమెరికా పైలట్లు బెదిరింపులకు దిగినా.. లొంగలేదు. పైగా సైనిక విమానాలను గాల్లోకి పంపడంతో అమెరికా విమానాలు తోకముడిచాయి. దీంతో మరో గత్యంతరం లేక చార్టర్డ్ విమానాల్లో ఆ దేశాలకు చెందిన పౌరులను అమెరికా తిప్పి పంపింది. పౌర విమానాల్లో వచ్చిన అక్రమ వలసదారులకు ఆ దేశాలు ఘనంగా స్వాగతం పలికాయి. వారికి భోజనం, కాఫీలు ఇచ్చి.. ప్రత్యేక బస్సుల్లో ఇళ్లకు పంపాయి. ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చేసి ఉంటే భారతీయులు సిగ్గుతో తలదించుకు వచ్చే పరిస్థితి ఉండేదికాదు. ప్రపంచగురువుగా కీర్తి అందుకుంటున్న భారత్.. తన దేశ పౌరుల ఆత్మాభిమానం విషయంలో వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోమాలియా సముద్ర దొంగలనుంచి.. యుద్ధాల సమయంలోనూ, ఐసిస్‌లో చెరలో చిక్కుకున్న భారతీయులను సైతం ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి విడిపించిన కేంద్ర ప్రభుత్వం.. ఆప్త మిత్రుడిగా చెప్పుకుంటున్న అమెరికా విషయంలో మాత్రం ఎందుకిలా బేలతనం ప్రదర్శిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. ఏదిఏమైనా చిన్న దేశాలే అయినా పౌరుల ఆత్మ గౌరవం విషయంలో అమెరికాను ఢీకొట్టేందుకు సైతం సిద్ధపడిన బ్రెజిల్, కొలంబియా, మెక్సికోకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
భారత్ ఏం చేయాలి?
అక్రమంగా అమెరికాకు వచ్చిన భారతీయులను వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకున్న వెంటనే భారత్ స్పందించి.. వారితో చర్చలు జరపాల్సింది. సైనిక విమానాల్లో తరలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి ముందే సమాచారం ఉన్నదని.. అమెరికా యంత్రాంగం కూడా ప్రకటించింది. ఈ విషయంలో ముందుగానే అప్రమత్తమై ఉంటే.. వారిని అమెరికా పౌర విమానాల్లో గానీ.. లేదా భారత్ ప్రత్యామ్నాయ మార్గాల్లో వారిని వెనక్కి రప్పించేందుకు చొరవ తీసుకోవాల్సింది. ఇలా చేసి ఉంటే.. భారత్ తమ పౌరుల విషయంలో రాజీ పడదన్న సందేశం ప్రపంచదేశాలకు బలంగా ఇచ్చినట్టు అయ్యేది. కానీ, మూడోసారి కూడా భారతీయులకు సంకెళ్లు వేసిన.. అమెరికా సైనిక విమానాలు భారత్ గడ్డపై దిగుతుండటం ఈ దేశవాసులకు మింగుడుపడని విషయం. ఇదిలాఉంటే తాజాగా అమెరికా అధ్యక్ష భవనం డిపోర్టేషన్ సమయంలో అక్రమ వలసదారులకు సంకెళ్లు వేసి పౌర విమానాల్లో పంపిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడం తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కొన్ని దేశాలకు పౌర విమానాలను పంపుతుండగా.. మిత్ర దేశంగా చెప్పుకొనే భారత్‌కు సైనిక విమానాల్లో పంపడం చర్చనీయాంశంగా మారింది.
అమృత్‌సర్‌లోనే ఎందుకు?
భారతీయులను డిపోర్టేషన్ చేసేందుకు అమెరికా సైనిక విమానాలు ఢిల్లీలాంటి ప్రధాన విమానాశ్రయాలను కాకుండా అమృత్‌సర్‌ను ఎంపిక చేయడంపై రాజకీయ దుమారం రేగుతున్నది. ఢిల్లీలో ఎన్నికలు జరుగుతుండటం వల్లనేనని కొందరు.. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేసేందుకేనని మరికొందరు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పంజాబ్‌ను డిపోర్టేషన్ కు వేదిక చేసిందని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ సింగ్ మాన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ రాజకీయ కోణాలను పక్కనబెట్టి.. సైన్యం రవాణాకు ఎంచుకునే మార్గాలను పరిశీలిస్తే ఇందుకు ఇందుకు గల కారణాలు అర్థం అవుతాయి. సాధారణంగా పౌర విమానాలు ఎక్కువమంది ప్రయాణికుల కోసం పలు దేశాల మీదుగా ప్రయాణం చేస్తాయి. అందుకు అవి గాలి వీచే దిశ ఆధారంగానూ, పాపులర్ టూరిస్ట్ కేంద్రాల మీదుగా ప్రయాణిస్తాయి. కానీ, సైనిక విమానాలకు గాలి వేగంతో సంబంధం లేకుండా ప్రయాణిస్తాయి. ఎక్కువ మలుపులు లేకుండా ఏకబిగిన ప్రయాణం చేసేలా మార్గాలను ఎంచుకుంటాయి. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుంది. అందుకే సైనిక విమానాలు అన్నీ దాదాపుగా పోలార్ రూట్స్ అంటే సరళరేఖగా ఉండే మార్గాలను ఎంచుకుంటాయి. అందుకే అమెరికా సైనిక విమానాలు పంజాబ్ లోని అమృత్‌సర్‌ని ఎంచుకున్నాయి. అమెరికాలో డిపోర్టేషన్ ప్రారంభమైన టెక్సాస్ లోని శాన్ ఆంటోనియో నగరానికి అమృత్ సర్ సరిగ్గా అడ్డం గీత గీసినట్టుగా ఒకే రేఖపై ఉంటాయి. అందుకే ఈ నగరాన్ని అమెరికన్లు ఎంచుకున్నారు. పైగా సీ17 గ్లోబ్ మాస్టర్ విమానం దిగేందుకు భారీ రన్ వే అవసరం. అమృత్ సర్ విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నదే కాదు.. భారత్ కు చెందిన భారీ సైనిక విమానాలు దిగేందుకు వీలుగా నిర్మించినది. అంతేకాకుండా.. పౌర విమానాల రాకపోకలు తక్కువగా ఉంటాయి.. కాబట్టి సైనిక విమాన భద్రతరీత్యా కూడా ఈ విమానాశ్రయం అత్యంత సురక్షితమైనదని భావించడం వల్లనే అమృత్ సర్ డిపోర్టేషన్ కు వేదిక గా మారిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకానీ, ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలకు తావులేదని సైనిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
సైనిక విమానాల్లో ఎందుకు?
గతంలో అక్రమ వలసదారులను అమెరికా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పౌర విమానాల్లోనే ఆయా దేశాలకు తరలించేది. కానీ, ఈసారి భిన్నంగా సైనిక విమానాలను ఎంచుకున్నది. వాస్తవానికి ఇది చాలా ఖరీదైనది. పౌర విమానాలతో పోలిస్తే.. సైనిక విమానాల నిర్వహణకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సీ17 గ్లోబ్ మాస్టర్ భారీ విమానం ఇందులో అనేక ఆయుధాలు, సిబ్బంది తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఈ విమానం ఒకసారి ఇండియాకు వచ్చి వెళ్లడానికి ఒక మిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని అంచనా. ఈ ఖర్చుతో మూడు పౌర విమానాలు వచ్చి వెళ్లే అవకాశం ఉంటుందని ఏవియేషన్ నిపుణులు చెప్తున్నారు. మరి ఇంత ఖర్చుతో భారత్ కు సైనిక విమానాల్లో తరలించడం వెనుక మర్మమేమిటని ప్రశ్నలు తలెత్తాయి. దీనికి కొందరు సైనిక వ్యవహారాల నిపుణులు బదులిస్తూ.. ఒక దేశంలోకి మరో దేశం సైనిక విమానం రావడం.. అందులో ఆ దేశానికి చెందిన పౌరులను సంకెళ్లతో తీసుకురావడం సిగ్గుచేటైన వ్యవహారంగా భావిస్తారు. మరోసారి అక్రమంగా తమ దేశంలోకి రావొద్దన్న బలమైన సంకేతం ఇచ్చేందుకే ఇలా సైనిక విమానాల్లో భారతీయులను తీసుకువచ్చారని చెప్తున్నారు.
వలసలు ఎలా ఆపాలి?
అందరూ అమెరికాకు ఎందుకు వెళ్తారు? అక్కడ ఏం ఉన్నది? ఉన్న ఊరుని, కన్నవాళ్లను వదిలి అమెరికాకు ఎందుకు వెళ్లడం? కాస్తో కూస్తో ఆదాయం ఉన్నవారికి ఇలాంటి ప్రశ్నలు రావడం సహజమే. కానీ, పనికి తగిన వేతనాలు లేక.. గొడ్డు చాకిరీ చేస్తున్నా సరైన గౌరవం లేని వాళ్లకు అమెరికా పెద్ద విషయమే. మన దేశంలో మామూలు లారీ డ్రైవర్ నెలకు రూ.20వేలనుంచి రూ30వేల మధ్య సంపాదిస్తాడు. అతడికి అన్ని ఖర్చులు పోను ప్రతి నెలా అప్పు మినహా పిల్లలకు కనీస అవసరాలు కూడా తీర్చలేడు. అలాంటివాళ్లకు అమెరికా ఓ స్వర్గధామం. ఎలాగైనా అక్కడికి వెళితే.. చాలు కుటుంబం కష్టాలు అన్నీ తీరిపోతాయనే నమ్మకం. పిల్లలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితులనుంచి బయటపడేందుకు ఉన్న భూమి, ఆస్తిపాస్తులు అన్నీ అమ్మేసుకుని దొంగ మార్గాల్లో అమెరికాలో అడుగుపెట్టేందుకు చాలామంది కోరి మరీ ప్రమాదాల్లో పడుతున్నారు. గత ఏడాది అమెరికా పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ అక్కడ అక్రమ వలసదారులు, భారతీయ విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దొంగదారుల్లో అమెరికా రావాల్సిన అవసరం ఏమి వచ్చిందన్న ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానాలతో ఆయన మరో ప్రశ్న వేయలేకపోయారు. భారత్ లో నెలరోజులు కష్టపడి లారీ నడిపితే వచ్చే ఆదాయం కంటే అమెరికాలో 20 రోజులు కష్టపడితే అందుకు 10రెట్ల ఆదాయం వస్తుందని దానితో సంతోషంగా బతకవచ్చని చెప్పారు.
అక్రమంగా వలస వెళ్లిన వారికోసం ప్రభుత్వం ఎందుకు పనిచేయాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజమే కానీ, ప్రభుత్వం అందరికీ ఉపాధి అవకాశాలు సక్రమంగా కల్పిస్తే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదే కాదు కదా.. అన్నది వలసదారులు అడుగుతున్న ప్రశ్న. దీనికి ఎవరు బదులివ్వాలి. ఎవరో వచ్చి తమ బతుకులు బాగు చేస్తారని వేచి చూడటం కంటే.. తప్పో ఒప్పో తమ దారి తాము చూసుకోవడం మంచిది కదా అన్నది వారి వాదన. ‘తాము అక్కడికి వెళ్తున్నది ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదు. ముఖ్యంగా అక్కడివారి ఉద్యోగాలను లాక్కోవడానికి అంతేకంటే కాదు. వారు చేసేందుకు ఇష్టపడని ఉద్యోగాలే తాము చేస్తున్నామని.. తమపై ఎందుకు కక్ష’ అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వంలో ఎవరు ఉన్నా.. వారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఓటు రాజకీయాలు కచ్చితంగా ఉంటాయి. అలాంటి నిర్ణయాలకు బలయ్యేది అంతిమంగా పేదలే అన్నది చారిత్రక వాస్తవం.