Twitter logo: ట్విట్టర్ పిట్టకు వేలం.. ఎంత ధర పలికిందంటే?

by D.Reddy |
Twitter logo: ట్విట్టర్ పిట్టకు వేలం.. ఎంత ధర పలికిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ (Twitter) (ప్రస్తుతం ఎక్స్) గురించి పరిచయం అక్కర్లేదు. దీనిని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk) సొంతం చేసుకున్నప్పటి నుంచి సంస్థలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ లోగో నుంచి బ్లూ బర్డ్ లోగోను (Blue bird logo) తొలగించి, ఎక్స్‌తో రీబ్రాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఐకానిక్‌ బ్లూ బర్డ్ లోగోకు 'ఆర్‌ఆర్‌ ఆక్షన్‌' సంస్థ వేలం నిర్వహించింది. ఈ వేలంలో లోగో 35 వేల డాలర్లకు (దాదాపు రూ.30 లక్షలకు) అమ్ముడైంది. ఒకప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కోలోని హెడ్‌క్వార్టర్‌ వద్ద దర్శనమిచ్చినా 12 అడుగుల పొడుగు, 9 అడుగుల వెడల్పు, 254 కిలోల బ్లూ బర్డ్‌ లోగో మంచి ధర పలికిందని ఆర్‌ఆర్‌ ఆక్షన్‌ తెలిపింది. అయితే వేలంలో దీనిని దక్కించుకున్న వ్యక్తి వివరాలను ఆయన అభ్యర్థన మేరకు ప్రకటించలేదు.

కాగా, 2022 అక్టోబర్‌లో ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లు చెల్లించి కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఈ సామాజిక మాధ్యమ సంస్థలో అనేక మార్పులు చేశారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. సంస్థ పేరును ట్విటర్‌ నుంచి ఎక్స్‌గా మార్చారు. కంటెంట్‌ మోడరేషన్‌లోనూ అనేక మార్పులు తీసుకొచ్చారు. అంతేకాదు, ఎక్స్ (ఒకప్పటి ట్విటర్‌)లోని పాత విలువైన జ్ఞాపకాలను ఆ సంస్థ అధినేత మస్క్‌ వేలానికి పెట్టారు. దీనిలో ట్విటర్‌ ప్రధాన కార్యాలయంపై ఉన్న పిట్ట బొమ్మ సైన్‌బోర్డ్‌ కూడా ఉంది.

Advertisement
Next Story