తెలంగాణలో మరో సర్వే.. ‘వారి’ కోసం ప్రత్యేక ప్రణాళిక..

by Anukaran |   ( Updated:2021-05-17 21:24:35.0  )
Sarve
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైద్యం అందక మృతి చెందిన పావని అంశమో, లేక మరేదైనా కారణాలో కానీ ఇప్పుడు గర్భిణీల సర్వే మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఎంత మంది గర్భిణీలు ఉన్నారు, వారికి అందించే ఆహారం, వాళ్ల డెలివరీ డేట్ వంటి అంశాలన్నీ నమోదు చేయాలని మరో కొత్త ప్రొఫార్మ విడుదల చేశారు. ఆదివారం రాత్రి అత్యవసర ఆదేశాలిచ్చి సోమవారం ఉదయం నుంచి లెక్కింపు చేయాలని సూచించారు.

ఏం చేస్తారు మరి..?

రాష్ట్రంలో ప్రస్తుతం ఫీవర్​సర్వే జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్​కమిషనర్ల ఆధ్వర్యంలో ఈ సర్వే చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 18 వరకు సర్వే పూర్తి కావాల్సి ఉండగా.. ఎలాగోలా సిబ్బంది దాదాపుగా 90 శాతం పూర్తి చేశారు. కొన్నిచోట్ల ఆలస్యమైతే అదనపు సిబ్బంది, ఇతర విభాగాల్లోని మొత్తం సిబ్బందిని అత్యవసరంగా ఈ సర్వేలోకి తీసుకున్నారు. దీంతో కొంత భయం భయంగానే సర్వేకు దిగుతున్నారు. అటు కరోనా సెకండ్​వేవ్​విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సర్వేపై చాలా విమర్శలు వస్తున్నా.. ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా రాష్ట్రంలోని ఏ ఇంటిలో గర్భిణీలు, స్త్రీలు ఉన్నారనే వివరాలను సేకరించాలని ఆదేశాలిచ్చారు. ఒక గ్రామంలో గర్భిణీలు ఎంతమంది ఉన్నారు, వారు ఎక్కడ వైద్యం చేయించుకుంటున్నారు, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి, డెలివరీ డేట్ వంటి అంశాలను నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

అంగన్ ​వాడీల్లో వివరాలున్నాయి కదా..!

వాస్తవంగా రాష్ట్రంలోని 5 ఏండ్లలోపు పిల్లలు, బాలింతలు, గర్భిణీల వివరాలన్నీ ఇప్పటికే అంగన్​వాడీ కేంద్రాల్లో ఉన్నాయి. వారికి పౌష్టికాహారం నిత్యం ఇస్తున్నారు. కానీ ఈ అంగన్​వాడీల్లో వివరాలను నమ్మడం లేదో.. ఎందుకో కానీ మళ్లీ గర్భిణీ స్త్రీల వివరాలను తీసుకోవాల్సి వస్తోంది. అయితే ఇటీవల రాజధానిలో పావని అనే నిండు చూలాలు వైద్యం అందక మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై చాలా విమర్శలు వస్తున్నాయి. దీనిలో భాగంగా వారికి వైద్యం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ఆఫ్​ది రికార్డుగా చెప్పుతున్నారు.

కానీ ఇప్పటికే వివరాలు ఉన్నాయనే విషయాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇప్పుడు గర్భిణీల వివరాలను తీసుకుని వారికి ఎక్కడ, ఏ సమయంలో వైద్యం అందించాలనే నివేదిక తయారు చేస్తారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సర్వేపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఒక విధంగా గర్భిణీల వివరాల సేకరణ మంచి పరిణామాలే అయినప్పటికీ.. గతంలో అంగన్​వాడీల్లో ఉన్న వివరాలు తీసుకుంటే సరిపోతుందనే సూచిస్తున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్​వేవ్​ నేపథ్యంలో గర్భిణీల వివరాలు ఉంటే సంబంధిత మున్సిపాలిటీ, మండలాల పరిధిలో వారి వైద్యంపై ముందస్తుగానే నిర్ణయం తీసుకునే అవకాశాలుంటాయి. రాష్ట్రంలో ఇప్పుడు ఆస్పత్రిల్లో సాధారణ పేషెంట్లకు అనుమతివ్వడం లేదు. చాలా ఆస్పత్రులు రావద్దంటున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణీలకు కూడా వైద్యం అందకపోవడం చాలా బాధాకరమైన విషయమే. అందుకే ముందస్తుగా గర్భిణీల వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రత్యేక ఫార్మాట్‌లో గర్భిణీ పేరు, ఉంటున్న ఏరియా, ఇంటి నెంబర్, మొబైల్​నెంబర్, ఇంటిలో ఎవరెవరు ఉంటున్నారు, ఇప్పటి వరకు ఎక్కడ వైద్యం చేయించుకుంటున్నారనే సమగ్ర వివరాలను తీసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed