ఆగడాలకు అడ్డుకట్ట

by Sridhar Babu |
ఆగడాలకు అడ్డుకట్ట
X

దిశ, కరీంనగర్ సిటీ : కష్టకాలంలో కరోనా రోగులను పీడిస్తూ, అడ్డు అదుపు లేకుండా కొనసాగిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలకు యంత్రాంగం ఎట్టకేలకు అడ్డుకట్ట వేస్తోంది. నిబంధనలు తోసిరాజనే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. జిల్లాలో కొవిడ్ చికిత్స అందించే ప్రైవేట్ ఆస్పత్రులపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టేందుకు నిర్ణయించి, తనిఖీ బృందాలు కూడా ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష లో వెల్లడించారు. దీంతో ఇకపై ఇష్టారాజ్యంగా దోపిడికి పాల్పడే ఆసుపత్రిలక ఆటలకు చెక్ పడనుండగా, కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి కొంతలో కొంతేనా ఊరట కలుగనుంది.

ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, నిబంధనల మేరకు అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు సరఫరా అయిన రెమ్ డీసీవర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ ఆయా ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న రోగులకు మాత్రమే వినియోగించాలని, కృత్రిమ కొరత సృష్టించవద్దని యాజమాన్యాలకు సూచించారు. ఏదేనీ ప్రైవేట్ ఆసుపత్రిలొ మందులకు, బెడ్ లకు, ఆక్సిజన్ కు, కృత్రిమ కొరత సృష్టించి కరోనా రోగులకు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తే సహించబోమని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి రోజు నేరుగా ప్రైవేట్ ఆసుపత్రులకు రెమిడిసివర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ సరఫరా అవుతుందని, వాటికి ఆసుపత్రులలో పక్కా రికార్డులు నిర్వహించాలని, ఏర్పాటు చేసిన ప్రత్యేక టీములు ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించాలని ప్రత్యేక తనిఖీ టీమ్ సభ్యులను ఆదేశించారు. ఏదేనీ ప్రైవేట్ ఆసుపత్రిలో తనిఖీ సందర్భంగా రికార్డులు చూపించని హాస్పిటల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల యాజమాన్యాల పై డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏపిడమిక్ యాక్ట్ క్రింద చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రతి ప్రైవేట్ ఆసుపత్రులలో పడకల లభ్యత ఆన్ లైన్లో వివరాలు ఉంటాయని, ఖాళీ పడకలు ఉండి బెడ్స్ లేవని కృత్రిమ కొరత సృష్టించిన వారి పై కూడా చర్యలు తీసుకోబడతాయని, ఐసిఎంఆర్ మార్గదర్శకాలకనుగుణంగా, కోవిడ్ రోగులకు వైద్యం అందిస్తేనే ఆసుపత్రులు కొనసాగిస్తారని లేకుంటే సీజ్ చేస్తామని తేల్చి చెప్పారు.ఈ సమావేశంలో జిల్లా డ్రగ్ ఇన్స్ పెక్టర్ కిరణ్, ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీకి ఏర్పాటు చేసిన రెండు తనిఖీ బృందాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

Next Story

Most Viewed