- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైదరబాదు రూపకల్పన వెనకనున్న మాస్టర్ మైండ్ కృష్ణ స్వామి గురించి తెలుసా?
వంద సంవత్సరాల క్రితమే హైదరాబాద్ రాజ్య ప్రాముఖ్యతను ఫొటోలలో బంధించి 'పిక్టోరియల్ హైదరాబాద్' పేర రెండు ఫొటో సంపుటాలను ప్రపంచానికి అందించిన తొలి తరం జర్నలిస్టు. ప్రాథమిక విద్యలో మాతృభాష అనివార్యతను గుర్తించిన విద్యావేత్త, బహుజనోద్ధరణలో కుల సంఘాల స్థాపనను ప్రోత్సహించిన సంఘ సంస్కర్త, నిజాం నిరంకుశ పాలనను వ్యతిరేకించిన జాతీయవాది.
రాజధానికి మాస్టర్‌ప్లాన్ రూపొందించి, అమలు పరచడానికి కృషి చేసిన పరిపాలనాదక్షుడు. ఆయనే 'కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్' హైదరాబాద్ నగర పాలక సంస్థ తొలి మేయర్‌గానూ పని చేశారు. దక్షిణ భారతంలో అతి పెద్ద ప్రచురణాలయాన్ని స్థాపించారు. స్వయంగా అనేక గ్రంథాలను రచించారు. ఇంగ్లిషు, ఉర్దూ భాషలలో పలు పత్రికలు నిర్వహించారు. రచయితగా, ప్రచురణకర్తగా బహుముఖ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించి భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా
1893 ఆగస్టు 19న జన్మించిన కృష్ణస్వామి హైదరాబాద్‌లోని ఛాదర్‌ఘాట్ స్కూల్‌లో మెట్రిక్యులేషన్, నిజాం కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. పోలీసు హెడ్ కానిస్టేబుల్‌గా కొన్ని రోజులు ఉద్యోగం చేశారు. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, ఇంగ్లిష్ తదితర భాషలలో ఆయన ప్రావీణ్యతను గుర్తించిన జమీందారులు ముక్సూద్ అలీఖాన్, రాయ్ భవానీ సహాయంతో హైదరాబాద్ ప్రధానమంత్రి ' కిషన్ పర్‌సాద్ బహదూర్' దగ్గర సహాయ కార్యదర్శిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి మరణించేంత వరకు నీతి, నిజాయితీలకు మారుపేరుగా, సంఘ సంస్కర్తగా, దీన జనోద్ధారకునిగా తన సేవలను కొనసాగించారు. తన ప్రతిభను చూపేందుకు జర్నలిజాన్ని ఒక సాధనంగా మలచుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా స్వయంకృషితో బాంబే వెళ్లి ప్రింటింగ్, ఫొటోగ్రఫీ, పత్రికా నిర్వహణ, ప్రచురణ తదితర రంగాలలో ఆధునిక శిక్షణ పొందారు.
హైదరాబాద్ గౌలిగూడలో 'చంద్రకాంత్ ప్రెస్' పేరిట దక్షిణ భారతంలోనే తొలి అధునాతన ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించారు. 1926లో 'దక్కన్ స్టార్' అనే ఆంగ్ల వార పత్రికను ప్రారంభించి సంపాదకునిగా వ్యవహరించారు. 1939లో 'మసావత్' అనే ఉర్దూ వార పత్రికను ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చాక 'ద న్యూ ఎరా' అనే ఆంగ్ల పత్రికకు సంపాదకుడిగా పని చేశారు. హిందుస్థాన్ టైమ్స్, హిందూ లాంటి పత్రికలకు హైదరాబాద్ పాత్రికేయునిగా నూ ఉన్నారు. రయ్యత్, ఇమ్రోజ్, సియాసత్, రహనుమా-ఏ-దక్కన్ లాంటి పత్రికలకు సామాజిక సమస్యల మీద వ్యాసాలు రాసేవారు. హైదరాబాద్ సంస్థాన చరిత్ర, సాంస్కృతిక విశేషాలను 'పిక్టోరియల్ హైదరబాద్' పేర 12 వందల పేజీల సంపుటాలను ఉర్దూ, ఇంగ్లిషు భాషలలో వెలువరించారు. హైదరాబాద్ నగర చరిత్ర, హైదరాబాద్ మున్సిపల్ పరిపాలనా వ్యవస్థ, హైదరాబాద్ రాష్ట్రం 30 సంవత్సరాల పోరాటం, ముదిరాజ్ జాతి చరిత్ర, గోవా రాష్ట్ర స్వాతంత్య్ర ఉద్యమం, నవాబ్ దీన్ యార్ జంగ్ బహదూర్ జీవిత చరిత్ర లాంటి అనేక చరిత్రాత్మక పుస్తకాలు రాశారు.
హైదరాబాద్ తొలి మేయర్ గా
1933లో 'చుడీ బజార్' నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1955లో డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక హైదరాబాద్ తొలి మేయర్‌గానూ వ్యవహరించారు. నాలుగో మేయర్‌గానూ ఎన్నికయ్యారు. తన పాలనా కాలంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. నగర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రారంభించారు. మహా నగరానికి 'మాస్టర్‌ప్లాన్' రూపకల్పన కృష్టస్వామి మేయర్‌గానున్న కాలంలోనే జరిగింది. రిక్షాలు లాగే అమానుష పద్ధతిని రద్దు చేసి, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించారు. జంతుబలులను నిషేధించారు. 1950లో కొత్త మున్సిపల్ చట్టం రూపకల్పన లో ప్రధాన పాత్ర పోషించారు. దళితులు, బహుజనుల అభ్యున్నతికి కృషి చేశారు.
భాగ్యరెడ్డి వర్మ తో కలిసి విద్యా వికాస, సంఘ సంస్కరణ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి వారితో కలిసి గ్రంథాలయాలు, వసతి గృహాలు ఏర్పాటు చేశారు. విద్యావేత్తలతో కలిసి 'పీపుల్స్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్సు' స్థాపించారు. నిజాంకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరచడానికి 'ఆంధ్ర వాలంటీర్ కోర్' గ్రూపును స్థాపించి కెప్టెన్‌గా వ్యవహరించారు. హిందూ ధర్మ పరిషత్ స్థాపించి దళిత జనోద్ధరణ, కుల వ్యవస్థ, అంటరానితనం వంటి వాటికి వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. వందేమాతరం ఉద్యమంలో రామానంద తీర్థ తో కలిసి పని చేశారు. గాంధేయవాది గా పేరుగాంచిన కొర్వి కృష్ణస్వామి నిరాడంబరంగా తన శేష జీవితాన్ని గడిపి 19 డిసెంబర్ 1967 న అనారోగ్యంతో మరణించారు. తెలుగు సమాజానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం కొంత ప్రయత్నాలు ప్రారంభించింది. ఆయన త్యాగాలను స్మరించుకునేందుకు, ఆయన మార్గాన్ని భావితరాలు ఆచరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసి ఉంది.
(కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ జయంతి సందర్భంగా)
పిట్టల రవీందర్
ముదిరాజ్ అధ్యయన వేదిక వ్యవస్థాపకులు
99630 62266