భూమిపై అంతరిక్ష సుడిగాలి.. ధ్రువీకరించిన శాస్త్రవేత్తలు

by Shyam |
భూమిపై అంతరిక్ష సుడిగాలి.. ధ్రువీకరించిన శాస్త్రవేత్తలు
X

దిశ, ఫీచర్స్ : భూమ్మీద ఇప్పటి వరకు ఎన్నోసార్లు సంభవించిన భారీ సుడిగాలుల వల్ల ఆస్తి, ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసిందే. అలాంటి ప్రకృతి విపత్తులను ముందే గుర్తించగలిగితే కొంత మేరకు నష్టం తగ్గించవచ్చనే కోణంలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు.. భూమి ఎగువ ఆవరణంలో తొలిసారి ‘అంతరిక్ష సుడిగాలి’ సంభవించినట్లు గుర్తించారు. ఇంతవరకు భూమి కింది ఆవరణంలోనే భారీ సుడిగాలులు ఏర్పడగా ప్రస్తుతం ‘స్పేస్ హరికేన్’ భూమిపై ఆవరణంలో ఏర్పడినట్లు వారు ధ్రువీకరించారు. కాగా అసలు భూమిపై ఆవరణంలో అంతరిక్ష తుఫాన్ ఎలా ఏర్పడింది? భూమ్మీద కాకుండా ఏయే గ్రహాల్లో అంతరిక్ష సుడిగాలులు సంభవించాయి? గ్రహాలకు, అంతరిక్షానికి ఉండే సంబంధాన్ని వీటి ద్వారా ఎలా తెలుసుకోవచ్చు? ఈ సుడిగాలి కారణంగా భూమికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? తెలుసుకుందాం..

సాధారణంగా భూమి దిగువ ఆవరణంలో పెద్ద పెద్ద తుఫానులు ఏర్పడతాయి. ఎగువ ఆవరణంలో అస్సలు ఏర్పడవు. కానీ అక్కడ కూడా తుఫానులు ఏర్పడినట్లు చైనా శాండంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తద్వారా అంతరిక్షానికి గ్రహాలకు సంబంధాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ తరహా భారీ తుఫాను లేదా సుడిగాలిని శాస్త్రవేత్తలు శాటిలైట్స్ ద్వారా పరిశీలించారు. భూమి పైన ఉండే ఐనో, మ్యాగ్నెటో స్పియర్(ఆవరణం)లో భూమ్మీద సంభవించినట్లుగానే పెద్ద పెద్ద గాలులు వీస్తూ, భూ అయస్కాంత క్షేత్రాలు ఏర్పడుతూ సుడిగాలి సంభవించినట్లు నిర్ధారించారు. ఈ పరిశీలన ఆధారంగా 1,000 కిలోమీటర్ల 3డీ ఇమేజ్ సృష్టించారు. ఉత్తర ధ్రువంపై భారీ గాలులతో కూడిన తుఫాను సంభవించినట్లు, వర్షానికి బదులుగా ఎలక్ట్రాన్లు కురిసి అయస్కాంత కేంద్రాలుగా మారినట్లు అంచనా వేస్తున్నారు.

ఈ అంతరిక్ష సుడిగాలి అత్యంత శక్తిమంతమైనదని, అతివేగంగా ప్రవహించగలదని, భూమిపై గల ఐనో ఆవరణ పరిస్థితులను బట్టి తెలుస్తోందని శాండంగ్ యూనివర్సిటీ సైంటిస్ట్ ప్రొఫెసర్ క్వింగ్ హీ జంగ్ తెలిపారు. సుడిగాలి వల్ల ఏర్పడుతున్న భూ అయస్కాంత కేంద్రాల ఆధారంగా అంతరిక్షంలోనూ అయస్కాంత క్షేత్ర సూచికలు, గురుత్వాకర్షణ శక్తి ఉందా? అనే విషయాలు కనుగొనాల్సి ఉంది. అయితే భూమ్మీద ఏర్పడే తుఫాను లేదా సుడిగాలులకు అంతరిక్ష సుడిగాలికి మధ్య తేడా అవి సృష్టించే బీభత్సం లేదా శక్తి (కెపాసిటీ) మాత్రమే. ఈ మేరకు భూమిపై ఆవరణంలో అంతరిక్ష సుడిగాలులు సంభవించినట్లుగానే ఇతర గ్రహాల్లోనూ ఈజీగా రావొచ్చని సౌరశక్తి ప్రవాహంగా మారడాన్ని బట్టి చెప్పొచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.

భూమ్మీద కాకుండా అంగారక, శని, గురు గ్రహాల్లో ‘అంతరిక్ష సుడిగాలులను’ ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే అవి భూమి దిగువ ఆవరణంలో సంభవించే సుడిగాలి మాదిరి ఉన్నట్లు తెలిపారు. సౌర శక్తి ఆధారంగా వేడి గాలుల వల్ల ఆయా గ్రహాల్లో తుఫాను సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. భూమి పై ఆవరణం ఐనోలో వచ్చిన అంతరిక్ష సుడిగాలి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో వచ్చిందని, శక్తిమంతమైన గాలులతో వచ్చిన ఆ తుఫాను సుమారు 8 గంటలపాటు ఉండి ఆ తర్వాత తగ్గుముఖం పట్టిందన్నారు. చైనా, అమెరికా, నార్వే, బ్రిటన్ శాస్త్రవేత్తలు డిఫెన్స్ మెటరోలాజికల్ శాటిలైట్ ప్రోగ్రామ్(DMSP) శాటిలైట్స్ ఆధారంగా అంతరిక్ష సుడిగాలి 3డీ ఇమేజ్ సృష్టించి పలు విషయాలు కనుగొన్నారు. ఈ స్టడీ సైన్స్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్‌లో ప్రచురితమైంది. ఈ అంతరిక్ష సుడిగాలుల వల్ల పలు దేశాలు పంపే స్పేస్ క్రాఫ్ట్స్‌కు కమ్యూనికేషన్ డిస్ట్రబెన్స్, శాటిలైట్ నావిగేషన్ ఇబ్బందులు తలెత్తొచ్చని శాస్త్రవేత్తలు వివరించారు.

Advertisement

Next Story