- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సారీ మేం పూర్తిస్థాయి జీతాలు చెల్లించలేం
– 30 శాతమే చెల్లిస్తాం
– 70 శాతం కేంద్రం సబ్సిడీ రూపంలో భరించాలి
– సుప్రీంకోర్టులో ప్రైవేటు కంపెనీల పిటిషన్
– కేంద్ర కార్మిక, హోం శాఖల ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం
దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ కాలంలో కార్మికులకు పూర్తిస్థాయి జీతాలు చెల్లించలేమని, కేవలం 30% మేర మాత్రమే చెల్లించగలమని, మిగిలిన 70% వేతనాన్ని కేంద్రం సబ్సిడీ రూపంలో చెల్లించాలని, ఆ మేరకు ఆదేశాలు ఇవ్వాలని పదకొండు ప్రైవేటు కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ గతనెల 20న , కేంద్ర హోంశాఖ గతనెల 29న ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)కి విరుద్ధమని పేర్కొన్నాయి. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం నష్టాల్లో ఉన్నప్పుడు, ప్రకృతి వైపరీత్యాలప్పుడు కంపెనీకి ‘లేఆఫ్’ ప్రకటించడం లేదా ఉద్యోగులను తొలగించడం ఆ కంపెనీలకు లభించిన అధికారం, హక్కు అని, ఇందులో ప్రభుత్వాలు జోక్యం చేసుకోడానికి వీల్లేదని ఆ పిటిషన్‌లో స్పష్టం చేశారు. హర్యానా కేంద్రంగా పనిచేస్తున్న’ఇన్‌స్ట్రుమెంట్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో మరో పది ఎంఎస్ఎంఈ కంపెనీలు కలిసి ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది.
లాక్‌డౌన్‌తో పరిశ్రమల్లో ఉత్పత్తి స్థంభించిపోయిందని, లావాదేవీలు ఆగిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఈ పరిస్థితుల్లో రెండు మంత్రిత్వశాఖలు ఇచ్చిన ఉత్తర్వులు తమకు ఆర్థికంగా, మానసికంగా సమస్యాత్మకంగా మారాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న టైంలో పూర్తిస్థాయి వేతనాన్ని చెల్లించలేమని, ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐ) వసూలు చేసిన నిధుల్లోంచిగానీ, ‘పీఎంకేర్స్’కు సమకూరిన ఫండ్స్‌లోంచిగానీ కార్మికులకు 70% మేర వేతనాన్ని సబ్సిడీ రూపంలో చెల్లించాలని పేర్కొన్నాయి.
పై సూచనలకు తోడు రాజ్యాంగంలోని, పారిశ్రామిక వివాదాల చట్టంలోని పలు కీలక అంశాలను పిటిషనర్లు ప్రస్తావించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విపత్తు నిర్వహణ అథారిటీ ద్వారా తగిన సహాయ, పునరావాస చర్యలు కల్పించడానికి నిధులను కేటాయించే వెసులుబాటు ఉన్నదని పిటిషనర్లు గుర్తుచేశారు. ఆ చట్టంలోని సెక్షన్ 65ప్రకారం కార్మికులకు జరిగే నష్టాన్ని భర్తీ చేయడం ప్రభుత్వ బాధ్యతే తప్ప ప్రైవేటు యాజమాన్యంది కాదన్న అంశాన్ని నొక్కిచెప్పారు. కార్మికశాఖ అంశాలపై ఏర్పడిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం లాక్‌డౌన్ కాలంలో కార్మికులకు, ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలను యాజమాన్యమే చెల్లించాలన్న అంశంపై భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ప్రసారమాధ్యమాల్లో వచ్చిన వార్తలను కూడా పిటిషన్‌లో ఆ ప్రైవేటు కంపెనీలు ప్రస్తావించాయి. ఆ పిటిషన్‌లో ప్రస్తావించిన కొన్ని చట్టబద్ధమైన అంశాలు :
– రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 39 ప్రకారం ‘సమాన పనికి సమాన వేతనం’, ‘నో వర్క్ నో పే’ అనే స్పష్టత ఉన్నది. కానీ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశాల్లో ‘కార్మికులు’ అంటే ఎవరనేదానిపై స్పష్టత లేదు.
– రాజ్యాంగంలోని ఆర్టికల్ 300 ప్రకారం ‘సంపదను ఆదా చేసుకున్న ఏ వ్యక్తి కూడా చట్టం ప్రకారం నష్టపోరాదు’ అనే హక్కు ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వ శాఖలు జారీ చేసిన ఆదేశాలు దాన్ని ఉల్లంఘించే తీరులో ఉన్నాయి.
– పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2(ఆర్ఆర్) ప్రకారం యజమాని తన ఉద్యోగులకు చెల్లించే డబ్బులను ‘వేతనం’గా పరిగణించలేం. దీన్ని అడ్వాన్సు పేమెంట్’గా లేదా భవిష్యత్తులో వేతనం అందుకునేదాంట్లో ‘అడ్జస్ట్‌మెంట్స్’ (సర్దుబాటు) చేసుకునేదిగా ఉండాలి. లేదా ‘లేఆఫ్’/ఉద్యోగుల తొలగింపు లాంటివాటికి చెల్లించే నష్టపరిహారంగా ఉండాలి.
– అదే చట్టంలోని సెక్షన్ 2(కెకెకె), 2 (ఓఓ), 25(సి) నుంచి ఎన్ వరకు కంపెనీకి లేఆఫ్ ప్రకటించడం లేదా ఉద్యోగులను తొలగించే అధికారం ఉంది. అదే చట్టంలోని 25(ఎం) ప్రకారం ప్రకృతి వైపరీత్యాల సమయంలో కంపెనీ యాజమాన్యం లేఆఫ్ ప్రకటన చేయడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన పనిలేదు. పరిశ్రమలు తీసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వాలు చట్టబద్ధంగా సవాలు చేయడానికి వీలు లేదు. ఇది కేవలం పరిశ్రమల యాజమాన్యం, కార్మికులకు మధ్య కుదిరిన ఒప్పందంగానే పరిగణించాలి.
– ప్రభుత్వాలు ‘బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అండ్ అదర్ వర్కర్స్’ అనే అంశం ప్రకారం ఏ కార్మికుడు ఈ రెండింటిలో దేనికిందకు వస్తారో స్పష్టమైన నిర్వచనం ఇవ్వలేవు.
– కరోనా నివారణ కోసం ప్రభుత్వమే లాక్‌డౌన్ ప్రకటించినందున ఆ వ్యాధి బారిన పడకుండా ఇంటికే పరిమితమై ఉండడం (సెల్ఫ్ క్వారంటైన్) అనేది ముందుజాగ్రత్త చర్యే అవుతుంది. అందువల్ల ఇఎస్ఐ సంస్థ తన దగ్గర ఉన్న నిధులను కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి. కంపెనీల యజమాన్యంపై వేతనాలు చెల్లించాలనే ఒత్తిడి తీసుకురాకూడదు.
– దేశంలో సుమారు 4.72 కోట్ల మంది కార్మికులకు ఇఎస్ఐలో సభ్యత్వం ఉంది. ఆ సంస్థ దగ్గర సుమారు రూ. 60 వేల కోట్లు ఉభ్నాయి. ఈ డబ్బుతో 70% వేతనాలకు ఖర్చు పెట్టవచ్చు. ప్రతీ నెలా కార్మికులు 4% చొప్పున సంస్థకు ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇందులో పరిశ్రమల యాజమాన్యం 3.25%, కార్మికులు 0.75% చెల్లిస్తున్నారు.
– కేంద్ర ప్రభుత్వం తరపున ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ నెలలో విడుదల చేసిన ప్రకటన ప్రకారం కార్మికులకు 70% వేతనాన్ని ఇఎస్ఐ చెల్లించనుందని, లాక్‌డౌన్ కారణంగా కార్మికులు విధులకు హాజరుకాలేకపోయారని, దీన్ని ‘సిక్ పీరియడ్’గా పరిగణించనున్నట్లు స్పష్టం చేసింది. కానీ మే నెల 1వ తేదీ సమీపిస్తున్నా ఇప్పటికీ ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.
– బ్రిటన్ ప్రభుత్వం నెలకు రెండున్నర వేల పౌండ్ల చొప్పున వేతనంలో 80% జాబ్ సెక్యూరిటీ కింద కార్మికులకు చెల్లిస్తోంది. కెనాడా ప్రభుత్వం సైతం 75% సబ్సిడీ రూపంలో కార్మికులకు వేతనాలను చెల్లిస్తోంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం రానున్న ఆరు నెలల వరకు ప్రతీ పదిహేను రోజులకు ఒకటిన్నర వేయి డాలర్లను ఇస్తోంది.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర కార్మిక, హోంశాఖలు మార్చి నెలలో జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని సుప్రీంకోర్టును ఆ పిటిషన్‌లో 11 ప్రైవేటు కంపెనీలు కోరాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని పలు చిన్న, మధ్య తరహా కంపెనీలు కార్మికులకు ఏప్రిల్ నెల వేతనాలను పూర్తిస్థాయిలో చెల్లించడం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో రెవిన్యూ పడిపోయిందనే పేరుతో ప్రభుత్వ ఉద్యోగులకు 50% వేతనాన్ని చెల్లించలేమంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయని, అలాంటప్పుడు వ్యాపార, ఉత్పత్తి లావాదేవీలు పూర్తిగా స్థంభించిపోయిన ప్రైవేటు పరిశ్రమలు మాత్రం పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించడం ఎంతవరకు సబబని పేరు వెల్లడించడానికి ఇష్టపడని రెండు ప్రైవేటు పరిశ్రమల యజమానులు ప్రశ్నించారు. ఇప్పుడు లాక్‌డౌన్ పేరుతో పరిశ్రమలు మూతపడింది ఒకటిన్నర నెల రోజులే అయినా దీని ప్రభావం ఐదారు నెలల వరకు ఉంటుందని అన్నారు.
కార్మికులకు లాక్‌డౌన్ కాలానికి పూర్తి వేతనం చెల్లించాలని, వారిని ఉద్యోగాల్లోంచి తీసివేయవద్దని అటు ప్రభుత్వాలు చెప్తున్నాయి. చెల్లించడం సాధ్యం కాదంటూ కోర్టులో పిటిషన్ ద్వారా కొన్ని కంపెనీలు మొరపెట్టుకుంటున్నాయి. చివరకు పరిశ్రమల యాజమాన్యమూ ఆదుకోక ఇటు ప్రభుత్వమూ సాయం చేయక ప్రైవేటు చిరుద్యోగుల భవిష్యత్తు అడకత్తెరలో తరహాలో తయారైంది. రెవిన్యూ లేదనే పేరుతో ప్రభుత్వాలు, ఆదాయం లేదనే పేరుతో పరిశ్రమల యాజమాన్యం చేతులెత్తేస్తే దేశంలోని సుమారు ఐదు కోట్ల మంది కార్మికుల (ఇది ఇఎస్ఐ లెక్క మాత్రమే. అనధికారికంగా దీనికి నాలుగైదు రెట్ల సంఖ్యలో కార్మికులు ఉన్నారు) భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.
Tags : LockDown, Private Industries, Wages, Salaries, ESIC, PMCARES, Supreme Court, Petition