వృద్ధాప్య అపోహలను తొలగిస్తున్న 70ఏళ్ల గ్రాండీస్

by Shyam |
వృద్ధాప్య అపోహలను తొలగిస్తున్న 70ఏళ్ల గ్రాండీస్
X

దిశ, ఫీచర్స్ : ‘జీవితం’లో సక్సెస్ ఎప్పుడు లభిస్తుంది? పదహారేళ్ల ప్రాయంలోనా? పాతికేళ్ల చౌరస్తాలోనా? హాఫ్ సెంచరీ దాటిన తర్వాత? రిటైర్‌మెంట్ ప్రకటించాకనా? చెప్పడం చాలా కష్టం కదా! ఉరుకుల పరుగుల జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునే తీరిక కూడా లేకుండా.. గమ్యస్థానమేంటో గ్రహించకుండా, అలవాటులో పొరపాటులా, పొరపాటే అలవాటుగా ఆగకుండా ప్రయాణిస్తుంటాం. కానీ ప్రతీ మనిషి ఎప్పుడో ఒకసారి తను కోల్పోయిన దాని గురించో, సాధించాల్సిన లక్ష్యం కోసమో ఆలోచిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు వయసుతో పనిలేకుండా, సమాజ ధోరణి లెక్కచేయకుండా, అడ్డంకులకు బెరవకుండా అడుగేస్తే చాలు.. చేజారిన అవకాశం, కాంక్షించిన గమ్యం తప్పకుండా చేరుతాం. అలా ఏడుపదులు దాటిన తర్వాత యంగ్ జనరేషన్‌తో పోటీపడుతూ, ‘గ్రాండ్‌ఫ్లుయెన్సర్స్’ రాణిస్తున్న ఇన్‌స్పిరేషనల్ బామ్మలు, తాతయ్యల విశేషాలు మీకోసం.

ఫిట్‌నెస్ ఫ్రీకర్

71 ఏళ్ల వయసులో జోన్ మెక్‌డొనాల్డ్ ఆరోగ్యం క్షీణించడంతో, అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, మూత్రపిండాల సమస్యతో బాధపడింది. మెక్ డోనాల్డ్ పరిస్థితి చూసిన ఆమె కూతురు ఇది మందులతో నయమయ్యే సమస్య కాదని, లైఫ్ స్టైల్ మారిస్తేనే ఆరోగ్యం మెరుగవుతుందని సూచించింది. కూతురు చెప్పిన మాటల్లోని వాస్తవం గ్రహించిన ఆమె తొలిసారి జిమ్‌కు వెళ్లడం ప్రారంభించింది. ఐఫోన్ సాయంతో డైట్ ప్లాన్, తీసుకునే ఆహారం వంటి విషయాలను నేర్చుకుంది. నాలుగేళ్లలో ఆమెలో అనూహ్య మార్పులు రాగా, ఆమె ఫిజికల్ ఫిట్‌నెస్ చూసి నేటి యువత కూడా ఫిదా అవుతున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా వ్యాయామాలు చేస్తుండటం విశేషం. ఇన్‌స్టాలో తన ఫిట్‌నెస్ వీడియోలు పంచుకునే మెక్‌డొనాల్డ్‌కు 1.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘అంతటి వయస్సులో ఎవరైనా ఈ పనులన్నింటినీ చేయగలగడం చాలా అరుదు’ అంటూ యంగ్ జనరేషన్ ఆమెను ఆకాశానికెత్తుతున్నారు. స్పోర్ట్స్‌వేర్ సహా సప్లిమెంట్ బ్రాండ్ ‘ఉమెన్స్ బెస్ట్’ అనే కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తుంది. డిజిటల్ టెక్నాలజీని నేర్చుకున్న తర్వాత ఆమె ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఓ యాప్‌ను ప్రారంభించడం విశేషం.

లగేట్టా గార్డెన్ :

78ఏళ్ల లగేట్టా వేన్‌కు గార్డెనింగ్, కుకింగ్ అంటే చాలా ఇష్టం. కానీ తీరకలేని కుటుంబజీవితం గడిపిన ఆమెకు ఈ వయసులోనే కాస్త విశ్రాంతి దొరకగా, ఆ సమయాన్ని తన అభిరుచి కోసమే వెచ్చిస్తోంది. ‘మిస్ గ్రాండ్‌మాస్ గార్డెన్’ పేరుతో 2020 జూన్‌లో టిక్‌టాక్ అకౌంట్ ఓపెన్ చేసి లగేట్టా మనవరాలు, తన గ్రాండ్ మా పెంచుకుంటున్న మొక్కలు, కూరగాయాల సాగు గురించి ‘గార్డెన్ టూర్’ పేరుతో ఓ వీడియో చేసి అందులో పోస్ట్ చేసింది. అనూహ్యంగా ఆ వీడియో సక్సెస్ కావడంతో లగేట్టాకు ఫాలోవర్స్ పెరిగిపోయారు. దీంతో లగేట్టా టిక్‌టాక్ గురించి మనవరాలిని అడిగి తెలుసుకుని, దానిపై అవగాహన పెంచుకుని ప్రస్తుతం ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అశేష అభిమానులను పొందింది. కుకింగ్, గార్డెనింగ్, లైఫ్ హ్యాక్స్ వంటి వివిధ అంశాలపై ఆమె వీడియోలు చేస్తోంది.

ఓల్డ్ గేస్ :

కాలిఫోర్నియాలోని కేథడ్రల్ సిటీకి చెందిన నలుగురు స్నేహితులు టిక్‌టాక్‌లో @oldgays పేరుతో ఓ అకౌంట్ ఓపెన్ చేశారు. అందరి వయసు 65ఏళ్లకు పైమాటే. వారి జీవితంలో ఈ తాజా అధ్యాయం ఎంతో ఉల్లాసంగా, కొత్తగా సాగుతుందని ఊహించలేదు. అంతేకాదు తమ మనసులోని భావాలను, తమకు ఎదురైన అనుభవాలను పంచుకోవడం వల్ల ఫేమస్ అవుతారని వారికి తెలియదు. కానీ ప్రస్తుతం ఈ గేస్ గ్రూప్ ఇంటర్నెట్ అంతటా విస్తృతంగా వ్యాపించి, అభిమానులతో సహా అనుచరులను గెలుచుకున్నారు. స్వలింగ సంపర్కులకు సంబంధించిన టాపిక్స్ సహా, తమ తమ లైఫ్ జర్నీ విశేషాలు, వారిమధ్య నడిచే ఫన్నీ కన్వర్జేషన్స్ టిక్‌టాక్ యూజర్స్‌కు ఎంతగానో నచ్చాయి. ‘60 సంవత్సరాల క్రితం, స్వలింగ సంపర్కుడని తెలిసినప్పటికీ, తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడేవాళ్లు, సమాజం స్పందన ఎలా ఉంటుందోనని రహస్యంగా ఉండేవాళ్లు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అలానే ఉన్నా మార్పు వస్తుంది. వాస్తవానికి, చాలా సందర్భాలలో, తల్లిదండ్రులు తమ పిల్లలలో ఒకరు స్వలింగ సంపర్కుడని తెలుసుకున్నప్పుడు, వారు అతన్ని వెంటనే ఇంటి నుండి తరిమికొడతారు. ఇది ఎంతమాత్రం భావ్యం కాదు. వాళ్లు మనుషులే’ అంటూ ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలోనూ ఈ గ్రూప్ కృషి చేస్తోంది.

బ్యూటీ టిప్స్ :

యూట్యూబ్ ట్యుటోరియల్స్ చూడటం ద్వారా 74ఏళ్ల కాండేస్ సిమా ఇన్‌స్టాగ్రామ్ కోసం వీడియో షూట్ చేయడం, ఎడిట్ చేయడం నేర్చుకుంది. ఆమె ఫిబ్రవరి 2019లో ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఫ్యాషన్ అండ్ స్టైల్‌ అంశాలను వివరించేందుకు @styleinyour70s.withleslieb అనే అకౌంట్ ఓపెన్ చేసింది. న్యూయార్క్‌కు చెందిన సిమాకు రెండేళ్ల క్రితం ఇన్‌ఫ్లుయెన్సర్ అనే పదం కూడా తెలియదు కానీ ప్రస్తుతం వేలాదిమందిని తన వీడియోలతో ఆకట్టుకుంటోంది.

AARP 2019 సర్వే ప్రకారం.. 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న చాలా మంది వ్యక్తులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు సాంకేతికతను ఉపయోగిస్తుండగా, 70 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో 37% మంది ప్రతిరోజూ సోషల్ మీడియాను ఉపయోగించారని పరిశోధనలో తేలింది. కరోనావైరస్ సంభవించినప్పటి నుంచి, ఓల్డ్ క్రియేటర్స్.. ఫేస్‌బుక్‌కు మించి తమ పరిధులను విస్తరించారు.

యువత ఓల్డ్ పీపుల్‌ను ఎందుకు అనుసరించాలనుకుంటున్నారు? అంటే యువత చేయలేకపోతున్న విషయాలను వివరించడంలో వాళ్లు ది బెస్ట్‌గా నిలుస్తారు. ప్రతి ఒక్కరికి వారి బామ్మలతో, తాతయ్యలతో విడదీయారాని అనుబంధముంటుంది. వీళ్లు పంచుకున్న విషయాలు వారిని గుర్తు చేస్తుంటాయి. వాళ్లు షేర్ చేసే లైఫ్ హక్స్, టిప్స్ అన్నీ కూడా జీవితానికి పనికి వచ్చేవే ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లు మన ఫ్యామిలీలో ఓ మెంబర్‌లా తోస్తుంది. 93 ఏళ్ల హెలెన్ రూత్ ఎలామ్ (బాడీవింకిల్), 67 ఏళ్ల లిన్ స్లేటర్ (ఐకాన్ యాక్సిడెంటల్),100 ఏళ్ల స్టైల్ లెజెండ్ ఐరిస్ ఆప్‌హెల్ వీళ్లంతా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గొప్ప సక్సెస్ సాధించారు. వందలాది మంది వృద్ధులు తమ జీవితం అందించిన సెకండ్ చాన్స్‌ను వినియోగించుకుంటూ ముందుకు సాగడం అభినందనీయం. సోషల్ మీడియాలో మరో గొప్ప విషయం ఏమిటంటే, మీరు ఫ్లోరిడాలో కూర్చుని వేరే దేశంలోని ఓల్డ్ ఏజ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఫాలో కావచ్చు. ఆమె అనుభవాలను, అందించే టిప్స్ వినొచ్చు. అది సరదాగా ఉంటుంది. ఎంతో భిన్నమైన అనుభూతిని పొందొచ్చు’
– మే కార్వోవిస్కీ, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు

Advertisement

Next Story

Most Viewed