బుక్​ చేసుకున్న ​టైమ్‌కు వెళ్లాల్సిందే..

by Anukaran |   ( Updated:2020-12-15 21:25:52.0  )
బుక్​ చేసుకున్న ​టైమ్‌కు వెళ్లాల్సిందే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్లాట్​ బుక్​ చేసుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చలానా సొమ్ము వదులుకోవాల్సిందే.. మరో విడత స్లాట్​కు కూడా ఆ డబ్బులను ఉపయోగించుకోలేని దౌర్భాగ్యం.. మూడు నెలల తర్వాత మొదలైన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సవాలక్ష సమస్యలు ఉన్నాయని, సామాన్యుడి ఇబ్బందికర పరిస్థితుల దృష్ట్యానే ‘ధరణి’ని మార్చాలని తాము పట్టుబడుతున్నామని రియల్టర్లు, బిల్డర్లు పేర్కొంటున్నారు. పోర్టల్​లో పేర్కొన్న కొన్ని నిబంధనలపై ఉద్యోగులకే క్లారిటీ లేదని ఆరోపిస్తున్నారు.

ఏదైనా ఆస్తి కొని రిజిస్ట్రేషన్ చేసుకుందామని స్లాట్​ బుక్ చేసుకుని, స్టాంపు డ్యూటీ చెల్లించి, చలానా కూడా అప్​లోడ్ చేసిన తర్వాత అనివార్య కారణంతో రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్​ సమయానికి కార్యాలయానికి వెళ్లకపోతే చలానా సొమ్ము పోయినట్లే. పైగా ఆ సొమ్మును తిరిగి మరోస్లాట్​ కు వినియోగించుకునే వీలుకూడా లేదు. అందుకే జాగ్రత్త పడాలని సబ్​ రిజిస్ట్రార్లు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరిగా అమ్మే వ్యక్తి, కొనే వ్యక్తి, సాక్షులు వచ్చే సమయాన్ని మాత్రమే ఎంచుకోవాలని వారు చెబుతున్నారు. ధరణి కార్డ్​ విధానం అదే చెబుతోందని, అందుకే తాము ఈ విధానాన్ని నిలిపివేయాలని కోరుతున్నట్లు రియల్​ఎస్టేట్​ సంఘాలు, బిల్డర్లు కూడా మరో వైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ప్రభుత్వ విధానంపై రియల్టర్లు మంగళవారం కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్​ఆర్ఎస్, ధరణిని రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సబ్​రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్, ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలకు భారీ స్పందన లభించింది. రియల్టర్లకు తోడుగా డాక్యుమెంట్ రైటర్లు, ప్లాట్ల యజమానులు మద్దతుగా నిలిచారు. కొన్ని జిల్లాల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలు కలిసి ధర్నాలు నిర్వహించారు. మూడు నెలల తర్వాత ప్రారంభించిన రిజిస్ట్రేషన్లతో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తానని కోర్టుకు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ మాట తప్పారని, ధరణిని ప్రవేశపెట్టారని తెలంగాణ రియల్టర్ల సంఘం ఆరోపించింది. ఎల్​ఆర్ఎస్​ రద్దు చేయడం, పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయడం, డాక్యుమెంట్ రైటర్లను కొనసాగించడం వంటి డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమిస్తామన్నారు.

ఇదిలా ఉండగా, రియల్టర్లు, బిల్డర్లు లేవనెత్తిన అనేక సందేహాల్లో చాలా వాటికి సమాధానం ఉందని సబ్​ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. సేల్ ​డీడ్​ డాక్యుమెంట్ రూపొందించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు. కానీ ఆ విషయంపై జనానికి మాత్రం అవగాహన కల్పించడం లేదు. కనీసం చైతన్య కార్యక్రమాలు చేపట్టకుండానే ‘ధరణి’ విధానాన్ని అమలు చేస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం నెలకొంది. చాలామంది సబ్​ రిజిస్ట్రార్లకు కూడా ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొత్త రిజిస్ట్రేషన్ సమస్యలు..

* కార్డ్ విధానంలో రిజిస్ట్రేషన్ అన్నారు. కానీ ఇది ధరణి లింకును, కార్డ్ సాఫ్ట్ వేర్ తో జత చేశారు.
* ఆస్తి లింకు దస్తావేజు వివరాలను చేర్చేందుకు అవకాశం లేదు.
* చెల్లింపుల వివరాలు, చెక్కు నంబర్లు, డీడీ నంబర్లు చేర్చేందుకు అవకాశం లేదు.
* బ్యాంకు రుణం ద్వారా ఖరీదు చేసేటప్పుడు ఆ విషయాన్ని చేర్చాలి. కానీ అది లేదు.
* సర్వే నంబరు ఎంట్రీ చేసినా దస్తావేజులో రావడం లేదు.
* బిల్డప్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఆర్సీసీ, రేకుల కప్పు మొదలైనవి తెలిపేందుకు ఆప్షన్ లేదు. కేవలం ఏరియా మాత్రమే ఉంది.
* దస్తావేజులో ఎక్కడా దస్తావేజు రాయించుకున్న తేదీ చూపడం లేదు.
* ఆస్తికి సంబంధించిన అన్ని ఒరిజినల్స్ కొనుగోలు చేసిన వారికి అమ్మిన వారు స్వాధీనం చేసినట్లుగా పేర్కొంటున్నారు. కానీ బిల్డర్లు, రియల్టర్లు ఒరిజినల్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు. కేవలం జిరాక్స్​ మాత్రమే ఇస్తారు.
* దస్తావేజులో మధ్యలో విక్రయించిన ఆస్తి షెడ్యూల్ క్రమంగా దస్తావేజుతో జతపరిచిన ప్లాను క్రమంగా అని డ్రాఫ్ట్ ఉంది. కానీ ప్లాన్ అప్ లోడ్ చేసేందుకు ఆప్షన్ ఇవ్వలేదు.
* దస్తావేజుతో అమ్మిన, కొన్నవారి నుంచి డిక్లరేషన్ తీసుకుంటున్నారు. వాస్తవానికి అమ్మినవారు మాత్రమే ఇవ్వాలి. కొన్న వారి నుంచి సదరు ఆస్తి సక్రమమైనదని, టైటిల్ క్లియర్ గా ఉన్నదని, నిషేదిత జాబితాలో లేదని, రుణాలు ఇతర పెండింగు బిల్లులు లేవని, కోర్టు వివాదాలు లేవని, ఆస్తి మార్పిడి చట్టబద్ధంగా ఎలాంటి ఆటంకాలు లేవని డిక్లరేషన్ తీసుకుంటున్నారు.
* కొత్తగా నిర్మిస్తున్న ఇండ్లకు టిన్​ నంబరు ఉండదు. నిర్మాణం పూర్తయితేనే నంబరు వస్తుంది. అప్పటి వరకు బిల్డర్ అమ్మకుండా ఉండాల్సిందేనా?
* ఏదైనా ఆస్తిలో కొంత భాగం అమ్మొచ్చు. ఐతే రిజిస్ట్రేషన్ చేస్తే మొత్తం ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట బదిలీ అవుతుంది.
* టిన్ నంబరు ఉన్నప్పటికీ యజమాని చనిపోతే వారి వారసులంతా కలిసి అమ్మేందుకు ఆప్షన్ ఇవ్వలేదు.
* నాన్ అగ్రికల్చరల్ పోర్టల్ లో డేటా ఎంట్రీ సమయంలో ఏవైనా అక్షర దోషాలు జరిగితే, చలానా పేమెంట్ తర్వాత సవరించే ఆప్షన్ లేదు.
* కొనుగోలుదారు రిజిస్ట్రేషన్ సమయంలో అందుబాటులో లేకుంటే, అతడి తరఫున రిప్రజెంటేటివ్​ను పంపే అవకాశం లేదు.
* జీపీఏ, ఎస్పీఏ, రెక్టిఫికేషన్, రాటిఫికేషన్, సప్లిమెంటల్, రిలీజ్ వంటి దస్తావేజులకు ఆప్షన్ ఇవ్వలేదు.
* కొలతలు చూపించే ఆప్షన్ లేదు. కార్డ్ విధానంలో ఉండేది.
* తెలుగులో కూడా దస్తావేజు ఉంటే అందరికీ చదువుకునేందుకు చాలా సౌలభ్యంగా ఉండేది.

ఫీజు ఒక్కటే..

ఇంటి నిర్మాణాలు అనేక రకాలు. కానీ అన్నింటికీ ఒకేలా స్టాంపు డ్యూటీ లెక్కిస్తున్నారు. ఉదాహరణకు మున్సిపాలిటీలో చ.అ. ఆర్సీసీకి రూ.700, రేకుల షెడ్డుకు రూ.380. ప్రస్తుతం అన్నింటికీ చ.అ.కు రూ.760 చూపిస్తున్నది. స్లాట్ బుక్ చేసుకున్న రోజునే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకపోతే కట్టిన చలానా డబ్బులకు ప్రమాదం. దాన్ని మార్చుకోవడానికి అవకాశం లేదు.

Advertisement

Next Story