భారత మార్కెట్లోకి సరికొత్త స్కోడా కుషాక్ విడుదల!

by Harish |
Skoda Kushaq
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా సోమవారం భారత మార్కెట్లోకి తన కొత్త స్కోడా కుషాక్‌ను విడుదల చేసింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో తీసుకొచ్చిన ఈ మోడల్ ధరను రూ. 10.50 లక్షల నుంచి రూ. 17.6 లక్షల మధ్య నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వివిధ ఫీచర్లను బట్టి మొత్తం 7 వేరియంట్లలో ఈ వాహనం లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఎస్‌యూవీ విభాగంలో ఉన్న కియా సెల్టోస్, హ్యూండాయ్ క్రెటా, రెనాల్ట్ డస్టర్ మోడళ్లను ఈ స్కోడా కుషాక్ వేరియంట్ గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌లోని రోడ్లను దృష్టిలో ఉంచుకుని ఈ మోడల్‌ను ఎంక్యుబీ-ఏ0-ఐఎన్ ప్లాట్‌ఫామ్‌పై కంపెనీ నిర్మించింది.

ఈ వాహనంలో ఐదుమంది ప్రయాణించే సౌకర్యం ఉంటుంది. ఎల్ఈడీ డై టైమ్ రన్నింగ్ లైట్స్, భిన్నమైన డిజైన్‌లో రూపొందించిన ఫాగ్ ల్యాంప్స్ లాంటి అధునాతన సౌకర్యాలతో వచ్చిన ఈ వాహనం క్యండీలైట్, ఆరెంజ్, టోర్నడో రెడ్, కార్బన్ స్టీల్, బ్రిలియంట్ సిల్వర్ రంగల్లో లభిస్తుందని కంపెనీ వివరించింది. అలాగే, ఈ కారు వేరియంట్‌ని బట్టి రెండు రకాల పెట్రోల్ ఇంజిన్‌లను కలిగి ఉంది. అంతేకాకుండా ప్రారంభ మోడల్‌కు రెండు ఎయిర్‌బ్యాగ్స్‌ని అమర్చామని, డైనమిక్ ఆటో మార్కెట్లో కుషాక్ వినియోగదారులను ఆకట్టుకోనున్నట్టు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హ్హోలిస్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed