- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్‌లో TRS వైఫల్యానికి 6 కారణాలు.. తెలుసా ?
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక బై పోల్, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ వైఫల్యానికి 6 కారణాలు కొట్టొచ్చినట్లుగా కనపడుతున్నాయి. ఇంతకు ముందు ఎన్నిక ఏదైనా అవలీలగా విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం కమలనాథులు కనిపించడంతో ప్రజలు అటు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే కొద్దిరోజుల వ్యవధిలోనే మరీ ఇంతగా టీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకతకు గల కారణాలేంటి ? ఇంతకీ ఏ తప్పులు.. గులాబీ పార్టీకి ముప్పుగా మారాయి ? అసలు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ఆదరణ కోల్పోయి, ఓటమి పాలవుతుందో ఒకసారి పరిశీలిస్తే.. ప్రధానంగా ఆరు కారణాలైతే జనాల్లో వినిపిస్తున్నాయి.
1. వరదసాయం ఎఫెక్ట్
ఎవరు ఏం చెబుతున్నా గ్రేటర్ ప్రజల్లో టీఆర్ఎస్‌పై ఇంతగా అసహనం పెరిగిపోవడానికి ముఖ్య కారణమైతే వరద సాయం విషయంలో చోటు చేసుకున్న అవకతవకలే. ఈ పరిణామాలే ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బ తీశాయన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. వేలాది కాలనీల్లో లక్షల సంఖ్యలో ప్రజలు నడుము లోతు నీళ్లలో అల్లాడుతుంటే కేటీఆర్, పద్మారావుగౌడ్ తప్ప మంత్రులెవరూ బయటకు వచ్చి బాధితులను పలకరించలేదన్న విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం అందించే రూ.10వేల సాయంలోనూ కార్పొరేటర్లు జేబులు నింపుకొని పేదల పొట్ట కొట్టడంతో.. ఆ షాక్ ఓటు రూపంలో టీఆర్ఎస్‌కు తగిలిందన్న మాటలు వినపడుతున్నాయి. మంత్రి తలసాని ‘వానొస్తే వరదలు రాక, నిప్పులు వస్తాయా’ అని బాధ్యతారహితంగా చేసిన కామెంట్లు.. ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురి చేయడమే గాక, గ్రేటర్ ఎన్నికల్లో సనత్‌నగర్ డివిజన్‌లో ఆరు స్థానాలకు గాను మూడింట ఓడించి కసి తీర్చుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వరదల సమయంలో సికింద్రాబాద్ ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొన్న పద్మారావుగౌడ్‌కు మాత్రమే ప్రజలు పట్టం కట్టారన్న పాయింట్ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది.
2. కార్పొరేటర్ల బెదిరింపులు
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99స్థానాలతో ఆల్ టైం విక్టరీ కొట్టిన టీఆర్ఎస్ హైకమాండ్.. కార్పొరేటర్లను అదుపులో పెట్టుకోలేదన్న విమర్శలూ లేకపోలేదు. శివారు ప్రాంతాల్లో సామాన్యులను బెదిరించి వెంచర్లు వేయడమే గాక.. ఏదైనా పని ఉందని దగ్గరకు వెళ్తే అనుచరుల ద్వారా డబ్బు వసూళ్లు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా కాలనీల్లో సైతం రోడ్లు, డ్రైనేజీల మరమ్మతులు, కొత్త సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టక పోవడం.. ప్రశ్నించిన వారిపై దాడులు చేసిన సంఘటనలూ టీఆర్ఎస్‌పై ప్రజాగ్రహానికి ఓ కారణమనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి.
3.పొగిడేవాళ్లను వెంట తిప్పుకోవడం
పైన చెప్పిన రెండు కారణాలు గ్రేటర్‌లో టీఆర్ఎస్ దెబ్బతినడానికి సగం కారణమైతే.. తనచుట్టూ పొగిడేవాళ్లను వెంట తిప్పుకునే సీఎం కేసీఆర్ వైఖరి కూడా ప్రజా సమస్యలు తెలియకుండా చేసిందనే వాదనలు పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి.. నాలుగింతలు ఎక్కువ చేసి చూపడంతో ప్రజల అసంతృప్తిని గుర్తించలేక పోయారని.. గల్లీ స్థాయిలో లీడర్‌కు అయినా తమ సమస్యను చెప్పుకుందామంటే లంచాలు, మందు దావత్‌లు అడగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారనే గుసగుసలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా నేతలకు బుద్దిచెప్పాలని ఫిక్స్ అయిన ప్రజలు తమ సమాధానాన్ని ఓటు రూపంలో గట్టిగా చెప్పారని బీజేపీ శ్రేణులు సైతం వెల్లడించడం గమనార్హం.
4. ప్రతిపక్షం లేకుండా చేయడం
2014 ఎన్నికల్లో 63సీట్లు గెలిచిన టీఆర్ఎస్ పార్టీ.. ఓటుకు నోటు ఇష్యూ తర్వాత అన్నిపార్టీల నుంచి వలసలను ప్రోత్సహించినా ప్రజల్లో ఏమంత ప్రతికూలత ఏర్పడలేదు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు కట్టబెట్టినా సరే, 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవడాన్ని మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. దాదాపు 100 మందికి పైగా అధికార పక్షానికి చెందిన ఎమ్మెల్యేలే ఉండటంతో ప్రజా సమస్యలు లేవనెత్తే గొంతే లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తమ సమస్యలను ఎవరికి చెప్పాలో ప్రజలకు అర్థం కాకుండా పోయింది. ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తున్నా.. అధికార పార్టీ నేతలు దొరికినకాడికి బరకడంతో టీఆర్ఎస్ అంటేనే జనాలకు ఎబ్బెట్టు కలిగిందని, ఆ ఫలితమే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూర్చిందనేది మరో వాదన.
5.ఎల్ఆర్ఎస్ ప్రభావం
అసలే కరోనా కారణంగా ఉద్యోగాలు పోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న గ్రేటర్ ప్రజలను ఎల్ఆర్ఎస్ తీవ్ర ఇబ్బందుల పాలు చేసిందన్న విమర్శలు వచ్చాయి. చేతిలో ఉన్న డబ్బులతో రోజులు గడవడమే ఇబ్బందిగా మారితే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకువచ్చి ముక్కు పిండి డబ్బు వసూలు చేసిందన్న కామెంట్లు ప్రజల్లో ఆగ్రహాం తెప్పించాయి. ఇదేక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు గ్రేటర్ ప్రచారంలో ఎల్ఆర్ఎస్ పోవాలంటే టీఆర్ఎస్ ఓడాలని ప్రజలను ఆలోచనలో పడేసేలా మాట్లాడటంతో ప్రజలు అధికార పార్టీకి షాక్ ఇచ్చారన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి.
6. మితిమీరిన విశ్వాసం
టీఆర్ఎస్ తొలిసారి అధికారం చేపట్టినప్పటి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉపఎన్నికల్లోనూ ఏక ఛత్రాధిపత్యం కొనసాగించింది. ఇదేక్రమంలో సరైన ప్రతిపక్షం లేకపోవడం, తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్న కాంగ్రెస్ నేతల్లో సఖ్యత లోపించి వర్గాలుగా ఏర్పడటం.. ఇన్నాళ్లుగా టీఆర్ఎస్‌కు కలిసొచ్చింది. అయితే ఇప్పటిదాకా మూడో స్థానంలో ఉన్న బీజేపీ.. లోక్‌సభ ఎన్నికల తర్వాత అనూహ్యంగా పుంజుకొని దుబ్బాక, గ్రేటర్‌లోనూ షాక్ ఇవ్వడంతో టీఆర్ఎస్‌కు ఇప్పుడు తెలిసి వస్తోందన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇన్నిరోజులు తమకు ఎదురేలేదని ఎగిరిపడటంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మితిమీరిన విశ్వాసం టీఆర్ఎస్ బడా నేతలను నేలమీదకు తీసుకువచ్చేలా చేసిందన్న విశ్లేషణలు తెరపైకొస్తున్నాయి.