ఫైనలియర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని.. సుప్రీంలో పిల్

by Anukaran |   ( Updated:2020-07-18 12:05:42.0  )
ఫైనలియర్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని.. సుప్రీంలో పిల్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోనూ ఫైనలియర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ సుప్రీకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలైంది. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే నేతృత్వంలోని శివసేన యువజన విభాగం ‘యువసేన’ ఈ పిటిషన్ దాఖలుచేసింది. దీనిని సుప్రీం విచారణకు స్వీకరించినట్లు యువసేన సెక్రటరీ వరుణ్ సర్దేశాయ్ తెలిపారు. పరిస్థితిని బట్టి ఆయా రాష్ట్రాలు తగిన నిర్ణయాలు తీసుకునేలా అనుమతించాలని యువసేన డిమాండ్ చేసింది. కాగా, ఇప్పటికే మహాప్రభుత్వం ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘దేశంలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు, నగరాలు మళ్లీ లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. ఎక్కువ మంది గుమిగూడొద్దని డబ్ల్యూహెచ్‌వో కూడా చెబుతోంది.ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రతో పాటు మరో ఏడు రాష్ట్రాలు ఫైనలియర్ పరీక్షలను రద్దు చేశారు. అయినప్పటికీ, ఫైనలియర్ పరీక్షలను నిర్వహించాల్సిందేనంటూ యూజీసీ ఆదేశించింది. 10 లక్షల మంది విద్యార్ధులున్న మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కొవిడ్-19 ఆంక్షల నడుమ పరీక్షలను నిర్వహించడం అసాధ్యం’’ అని యువసేన తన పిటిషన్‌లో పేర్కొంది.

పరీక్షలను రద్దు అంశాన్ని లేవనెత్తాలంటూ ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థుల నుంచి తమకు విజ్ఞప్తులు అందాయని వరుణ్ సర్దేశాయ్ వెల్లడించారు. ఆన్‌లైన్ క్యాంపైన్ ద్వారా పరీక్షల రద్దు కోరుతూ 2 లక్షల మందికి పైగా విద్యార్ధులు సంతకాలు చేసినట్టు ఆయన వివరించారు. ఇదే అంశంపై ఆదిత్య థాకరే నేతృత్వంలో తాము యూజీసీ, కేంద్ర మానవ వనరుల శాఖలకు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందనా లేకపోవడంతోనే పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed