South Korea: సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్ట్..!

by Shamantha N |
South Korea: సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ అరెస్ట్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: సౌత్ కొరియా (South Korea) అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ ని పోలీసులు అరెస్టు చేశారు. అనూహ్యంగా ఎమర్జెన్సీ ప్రకటించి ఆయన ఇప్పటికే అభిశంసనకు గురయ్యారు. ‘మార్షల్‌ లా’ విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్‌ను (Yoon Suk Yeol) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున వందలమంది దర్యాప్తు అధికారులు అధ్యక్ష నివాసానికి చేరుకున్నారు. అయితే,అధ్యక్షుడి భద్రతా దళాలు అధికారులను అడ్డుకున్నాయి. కొంతసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. దీంతో, ప్రెసిడెంట్ బిల్డింగ్ లోకి వెళ్లి యూన్ సుక్ యోల్ ను అదుపులోకి(South Korea President Yoon Suk Yeol Arrested). తీసుకున్నారు. ఆ తర్వాత భారీ భద్రతతో ఆయన్ని అక్కడ్నుంచి తరలించారు. గతంలో యోల్‌ను అరెస్టు చేసేందుకు ఓసారి ప్రయత్నించగా.. పెద్దఎత్తున ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ పరిణామాలను దృష్టిలోఉంచుకొని నేడు భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎమర్జెన్సీ విధింపు

ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. గతేడాది డిసెంబరులో సౌత్ కొరియా అధ్యక్షుడు ‘ఎమర్జెన్సీ మార్షల్‌ లా’ (Emergency Martial Law) విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో యూన్‌ సుక్‌ తన ప్రకటనను విరమించుకున్నారు. అయితే, ఆయన రాజీనామాకు ప్రతిపక్షాలు పట్టుబడ్డాయి. మార్షల్ లా అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత అది చట్టవిరుద్ధం అని స్పీకర్ ప్రకటించారు. అంతేకాకుండా, ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. దీంతో ఆయన అభిశంసనకు గురై అధ్యక్ష అధికారాలను కోల్పోయారు. మరోవైపు, ఎమర్జెన్సీపై విచారించేందుకు దర్యాప్తు అధికారులు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. దీంతో కోర్టుని ఆశ్రయించగా.. అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. దీంతో, యూన్ సుక్ ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story