- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TG Farmers: సన్న వడ్ల సాగుకు అన్నదాతలు ‘సై’.. రూ.500 బోనస్‌తో పెరుగుతోన్న ఆసక్తి

దిశ, తెలంగాణ బ్యూరో: యాసంగి సీజన్‌లో సన్న వడ్లు సాగు చేసేందుకే రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. వానాకాలంలో సన్న వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇవ్వడంతో ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. యాసంగిలో 54 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు అవుతుందని, అందులో 40 లక్షల ఎకరాల వరకు సన్నాలు పండించే అవకాశం ఉందని ఆఫీసర్ల అంచనా. అందుకు తగినట్టు వరి విత్తనాలను ప్రభుత్వం జిల్లాలకు సరఫరా చేసింది. వానాకాలం సీజన్‌లో విత్తనాలకు కొరత ఏర్పడంతో దాని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా డిసెంబర్మొదటి వారంలోనే మండల వ్యవసాయ శాఖ కార్యాలయాలకు తరలించారు.
సన్నాలకు భారీ డిమాండ్
బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. మధ్యతరగతి, ఉన్నత వర్గాల కుటుంబాలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండటంలో ప్రైవేటు మిల్లర్లు, ట్రేడర్లు ఈసారి సన్న వడ్లను కల్లాల వద్దకు వెళ్లి కొనుగోలు చేశారు. వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్ కలిసి రూ.2,830 చెల్లించింది. ఇప్పటి వరకు 53 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించి కొనుగోలు కేంద్రాలను మూసేసింది. ఇక ప్రయివేటు వ్యాపారులు సన్న వడ్లకు ఎలాంటి కొర్రీలు పెట్టకుండా రైతుల నుంచి రూ.3,200 వరకు కొనుగోలు చేశారు. మద్దతు ధర లభించడంతో పాటు ప్రభుత్వం బోనస్ సైతం ఇస్తుండడంతో రైతులు ఈ సారి దొడ్డు వరి సాగును తగ్గించి సన్న వడ్లు సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
1.54 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా
యాసంగి సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసి 1.54 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేసింది. ఇందులో సుమారు 40 లక్షల ఎకరాల్లో సన్న వడ్లు వేసే అవకాశం ఉన్నది. మొత్తంగా 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎరువులు పంపిణీ స్టార్ట్ అయ్యింది. ఇక బ్యాంకర్లు రైతులకు పంట రుణాలు సైతం అందజేస్తున్నారు.
దిగుబడి తగ్గినా సన్నాలతో లాభమే..
దొడ్డు రకాలు ఎకరానికి 28 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తే సన్న వడ్లు 22 నుంచి 25 క్వింటాళ్లు వస్తాయి. వానాకాలం సీజన్‌లో గత మద్దతు ధర క్వింటాల్‌కు సాధారణ రకానికి రూ.2,300, ఏ గ్రేడ్ రూ.2,320గా కేంద్రం నిర్ణయించింది. వ్యాపారులు సన్నవడ్లను రూ.3,200 వరకు కొనుగోలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో కోతలకు ముందే రైతులకు అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారు. మద్దతు ధర కంటే ఎక్కువ రేటు రావడంతో పాటు ధాన్యం ఆర బెట్టడం, తూర్పార బట్టడం, కొనుగోలు కేంద్రాలకు తీసుకరావడం వంటి శ్రమ రైతులకు తప్పింది. ఈ సారి యాసంగి పంట మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.
ఏటేటా పెరుగుతున్న సన్నాల సాగు..
వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 2019-20లో 91.45 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వడ్ల రాగా, 86.79 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం దిగుబడి వచ్చింది. 2020-21 ఏడాదిలో 125.51లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం, 93.01లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం , 2021-22లో 105.90 లక్షల మెట్రిక్ టన్నులు సన్నవి, 96.26 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడి వచ్చింది. 2023-24లో 174.18 లక్షల దొడ్డు ధాన్యం, 86.26 లక్షల సన్నధాన్యం దిగుబడి వచ్చింది.
సాగు చేసే సన్నవడ్ల రకాలు
తెలంగాణలో ఎక్కువగా ఆర్ఎన్‌ఆర్, కేఎన్ఎం, వర్ష, కావేరి, హెచ్ఎంటీ, చింటూ, జైశ్రీరామ్, బీపీటీ వంటి సన్న రకాలు సాగు చేస్తున్నారు. కొన్ని జిల్లాలో సాయి రామ్, సాయిరామ్ గోల్డ్, దఫరి 1008, అక్షయ, అక్షయ గోల్డ్, సిరి, సమృద్ధి, జీకె సావిత్రి, దివ్యజ్యోతి, అంకుర్ 101, డబ్ల్యూజీఎల్ 14 రకాలు వేస్తున్నారు.