ఏ పార్టీకి ఏజెంట్‌ను కాదు.. గెలిచేది నేనే: షర్మిల

by Anukaran |
ఏ పార్టీకి ఏజెంట్‌ను కాదు.. గెలిచేది నేనే: షర్మిల
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాను ఏ పార్టీకి ఏజెంట్ ను కాదని, తమకు ఎవరితోనూ పొత్తు అక్కర్లేదని వైఎస్సార్ కుమార్తె షర్మిల స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ అడిగితే రాజకీయాల్లోకి రాలేదని, ఏ పార్టీతోనూ సంబంధం లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్ లోటస్ పాండ్‌‌లో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులు, నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 9న నిర్వహించే సంకల్పసభకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. తమ సంకల్పం ఏమిటో ప్రజలకు చెప్పేందుకే ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

అదే రోజన తన తండ్రి వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించారని, ఆ రోజున మొదటి అడుగు వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం సభకు సంబంధించిన వాల్ పోస్టర్లు, జెండాలను ఆవిష్కరించారు. కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆమె స్పష్టంచేశారు. అనంతరం షర్మిల అనుచరుడు పిట్టా రాంరెడ్డి ఖమ్మం సభ రూట్ మ్యాప్ ను ప్రకటించారు. ఏప్రిల్ 9 ఉదయం 8 గంటలకు షర్మిల లోటస్ పాండ్ నుంచి బయలుదేరుతారని, లక్డీకాపూల్, కోఠి, ఎల్ బీ నగర్, హయత్ నగర్ మీదుగా మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం జిల్లాకు వెళ్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ వద్దకు చేరుకుంటారని ఆయన వివరించారు.

రేపు ఆదిలాబాద్, నిజామాబాద్ నేతలతో ఆత్మీయ సమ్మేళనం

రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల వారీగా నాయకులు, అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్న షర్మిల శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నాయకులతో సమావేశం కానున్నారు. తద్వారా ఆ ప్రాంత సమస్యలను తెలుసుకోనున్నారు.

షర్మిలకు మద్దతు తెలిపిన నాయకులు

షర్మిలకు నాయకులు, ప్రజల మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో 2014లో నాగార్జునసాగర్ లో వైస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసిన మల్లు రవీందర్ రెడ్డి, సహారా ఎస్టేట్ ప్రతినిధి కోటగిరి సాంబమూర్తి ఆమెను కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.

Advertisement

Next Story