- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
18 ఏళ్ల తర్వాత అత్యంత కీలక సమావేశం.. కాంగ్రెస్‌లో పెను మార్పులు జరుగబోతున్నాయా?

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ జిల్లా అధ్యక్షులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నది. త్వరలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు ఫుల్ పవర్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతున్నది. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ, లోక్ సభ టికెట్ల కేటాయింపులోనూ డీసీసీ ప్రెసిడెంట్లు క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశముంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా నటరాజన్ వచ్చాక.. పలు అంశాల్లో డీసీసీలను భాగస్వాములను చేయాలని భావించారు. లోక్ సభ టికెట్ల కేటాయింపు కోసం ఏఐసీసీ ఏర్పాటు చేసే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) మాదిరి రాష్ట్ర స్థాయిలో టికెట్ల కేటాయింపునకు ఏర్పాటు చేసే కమిటీల్లో డీసీసీ అధ్యక్షులను నియమించాలని అధిష్టానానికి ప్రతిపాదించినట్టు తెలిసింది. దీనికి అధిష్టానం సైతం ఓకే చెప్పినట్లు చర్చ జరుగుతున్నది.
కిందిస్థాయి నుంచి పార్టీ పటిష్టతకు ప్లాన్..
కింది స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు డీసీసీలకు ప్రయారిటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. వీరి ద్వారానే పార్టీలో జిల్లా, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులు ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులోనూ డీసీసీల నిర్ణయమే ఆఖరిగా పరిగణించాలని భావిస్తున్నట్లు తెలిసింది. డీసీసీలకు సంబంధం లేకుండానే టికెట్లు కేటాయించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందని అధిష్టానం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తున్నది.
పద్దెనిమిదేళ్ల తర్వాత..
డీసీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా అధ్యక్షులతో భేటీ అయ్యేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీ అయింది. పద్దెనిమిదేళ్ల తర్వాత ఈ నెల 27 నుంచి ఢిల్లీలో డీసీసీలతో సమావేశం కానుంది. ఈ మేరకు ఈ నెల 26న డీసీసీ అధ్యక్షులు ఢిల్లీకి వెళ్లి.. ఆ మరుసటి రోజు నుంచి జరగనున్న మీటింగ్స్ లో పాల్గొననున్నారు. ఏఐసీసీ అగ్రనేతలతో డీసీసీలు భేటీ కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఏఐసీసీ పెద్దలతో సమావేశం మామూలు విషయం కాదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర స్థాయిలో జరిగే భేటీలకే డీసీసీలను పిలవని పార్టీ నేతలు.. ఏకంగా హస్తినకు ఆహ్వానించడమంటే.. పార్టీలో జరుగుతుతున్న భారీ మార్పులకు నిదర్శనమని చెబుతున్నాయి.