హుజురాబాద్​ బై పోల్స్.. షర్మిల మాస్టర్ ప్లాన్

by Shyam |   ( Updated:2021-09-29 08:48:07.0  )
హుజురాబాద్​ బై పోల్స్.. షర్మిల మాస్టర్ ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉపఎన్నికపై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికలు పగ, ప్రతీకారానికి నడుమ జరుగుతున్నాయని, ఇందులో తమ పార్టీ పాల్గొనేది లేదని షర్మిల ఇప్పటికే స్పష్టం చేసినా.. సర్కార్ పై పరోక్షంగా పోరుకు ఆమె సిద్ధమయ్యారు. ఈ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్​సర్కార్​కు వ్యతిరేకంగా బరిలో దిగాలనుకునే నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, యువకులకు తమ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని గతంలోనే ప్రకటించారు. పాల్గొనాలనుకునే వారు హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల కోఆర్డినేటర్ బొమ్మ భాస్కర్ రెడ్డిని సంప్రదించాలని ఆమె కార్యాలయవర్గం కూడా స్పష్టం చేసింది. తాజాగా ఎన్నికల కమిషన్ ​హుజురాబాద్​ ఉపఎన్నికలకు షెడ్యూల్​ విడుదల చేయడంతో అంతటా హంగామా మొదలైంది. వైఎస్సార్ ​తెలంగాణ పార్టీ ప్రత్యక్షంగా బరిలో నిలవకపోయినా.. తమ పార్టీ ఎఫెక్ట్ కనిపించేలా షర్మిల ప్రణాళికలు వేస్తున్నారు.

ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్​కు ఉపఎన్నిక అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రధాన పార్టీలు తమ తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. నిజామాబాద్ పసుపు బోర్డు ఉద్యమం తరహాలోనే నిరుద్యోగ సమస్యపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రణాళికలు వేస్తున్నారు. హుజురాబాద్ బై పోల్ షెడ్యూల్ ప్రకటన రాకముందు నుంచే టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా.. నేనా.. అన్నట్లు తలపడగా ప్రకటన వచ్చాక మరింత స్పీడ్​ పెంచారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఫోకస్ పెట్టింది. ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిరుద్యోగులు, యువకులను కనీసం 200 మందిని బరిలోకి దింపేందుకు ప్లాన్ ​చేస్తోంది.

నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష పేరిట ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల పోరాడుతున్నారు. దానికి తోడు హుజురాబాద్​ ఉపఎన్నికల్లో యువకులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల తరుపున అభ్యర్థులను బరిలోకి దింపి పరోక్షంగా వారి మద్దతు తమ పార్టీకి ఉండేలా ఆమె ప్లాన్​ చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ మార్క్​ను చూపించేందుకు షర్మిల ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక స్వయంగా షర్మిల రంగంలోకి దిగే అవకాశాలుంటాయని వినికిడి.

Advertisement

Next Story

Most Viewed