ఏడుపాయల్లో ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు

by Shyam |
edupayalu
X

దిశ ,పాపన్నపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడుపాయలకు చేరుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం రాజగోపురం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోకుల్ షెడ్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడు పెద్ద ఎత్తున కురిసిన వర్షాల మూలంగా సింగూరు డ్యాం నుండి వనదుర్గ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరదలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వనదుర్గ ప్రాజెక్టు నుండి అమ్మవారి ఆలయం ముందుగా మంజీరా ఇంకా ప్రవహిస్తున్నందున అమ్మవారిని దర్శించుకోవడానికి వీలు పడడం లేదని వెల్లడించారు.

మొదటిరోజు శైలపుత్రి గా
ఏడుపాయల వన దుర్గ భవాని మాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు శైలపుత్రి గా దర్శనమిచ్చారు. గురువారం పాడ్యమి ని పురస్కరించుకొని ముదురు పసుపు రంగులో అమ్మవారిని అలంకరించారు. వేకువజామునే అమ్మవారికి గణపతి పూజ, అఖండ దీపారాధన, పుణ్యాహ వచన నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. రెండో రోజైన శుక్రవారం విదియ ను పురస్కరించుకొని శ్రీ మహాలక్ష్మి దేవి రూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

షాపింగ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన

శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న అనంతరం ఏడుపాయలలో 3. 16 కోట్ల వ్యయంతో నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ కు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏడుపాయల లోని దేవాదాయశాఖ కార్యాలయం పక్కన ఈ షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించనున్నట్లు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ వెల్లడించారు.

Advertisement

Next Story