జీహెచ్ఎంసీకి సిగ్గు లేదా? : హైకోర్టు

by Shyam |   ( Updated:2021-07-17 08:16:49.0  )
TS-High-Court
X

దిశ, సిటీ బ్యూరో : మహానగర పాలక సంస్థ నిర్లక్ష్యంతో గుంతల మయమైన రోడ్లపై ప్రమాదాలు సంభవించి అనేక మంది ప్రాణాలు కోల్పొయిన ఘటనల నేపథ్యంలో స్పందించి తమ పెన్షన్ డబ్బులతో గంగాధర్ తిలక్ అనే వృద్ద దంపతులు రోడ్లకు మరమ్మతులు చేయటంపై హై కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(పిల్) దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన కోర్టు వృద్దులు తమ పెన్షన్ డబ్బులతో రోడ్లకు మరమ్మతులు చేస్తుంటే జీహెచ్ఎంసీకి సిగ్గు లేదా? మీకు ఇవ్వాల్సిన జీతాలు ఆ వృద్దులకు ఇవ్వటం మేలు అని ఘాటుగా వ్యాఖ్యానించిన హైకోర్టు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. రోడ్లపై జీహెచ్ఎంసీ ఏమీ చర్యలు చేపట్టిందో విన్నవించాలని ఆదేశించటంతో గత మూడు రోజులుగా ఇంజనీరింగ్ మెయింటనెన్స్ విభాగం ఇదే పనిలో నిమగ్నమైంది. ఇప్పటి వరకు రోడ్లకు చేపట్టిన మరమ్మతుల వివరాలతో కూడిన నివేదికను సిద్దం చేస్తున్నారు. ముఖ్యంగా రోడ్లపై వర్షాకాలంలో ఏర్పడే గుంతలు పూడ్చేందుకు ఏడాది పొడువున శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేకంగా పని చేసే వ్యవస్థ ఉన్నట్లు వెల్లడించేందుకు సిద్దమవుతున్నారు.

దీంతో పాటు వర్షకాలంలో రోడ్లపై ఏర్పడే గుంతలను ఎప్పటికపుడు పూడ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు లిఖితపూర్వకమైన నివేదికలను జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది ద్వారా నివేదికను ఈ నెల 20న జరిగే పిల్ విచారణలో భాగంగా సమర్పించేందుకు సిద్దమవుతున్నారు. 131 స్టాటిక్ లేబర్ టీంలు, ఇన్స్ టెంట్ రీపేర్ టీంల వివరాలను కోర్టుకు సమర్పించాలని భావిస్తున్నారు. ఏడాది పొడువున రోడ్లకు మరమ్మతులు చేపడుతామని, నాలుగైదు రోజుల పాటు ఎడతెరపి లేకుండా వర్షాలు కురిస్తే మరమ్మతలు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురవుతాయని నివేదికలో వెల్లడించాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేగాక, రోడ్ల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు బల్దియాలో ఇంజనీరింగ్ విభాగంలో మెయింటనెన్స్ విభాగంతో పాటు హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్ఆర్ డీసీఎల్), స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్(సీఆర్ఎంపీ)లను ఏర్పాటు చేసినట్లు, ఇప్పటి వరకు వాటి ద్వారా అభివృద్ది చేసిన రోడ్ల వివరాలను కూడా కోర్టుకు సమర్పించనున్నారు. ఇలాంటి సమాచారంతో నివేదికను తయారు చేయటంలో కమిషనర్ లోకేశ్ కుమార్, చీఫ్ ఇంజనీర్ దేవానంద్ మాడపాటి నిమగ్నమై ఉన్నారు. రోడ్లకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని కూడా ఉన్నతాధికారులు అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

పగ, ప్రతీకారం తీర్చుకోవడానికే హుజురాబాద్ ఎన్నికలు-వైఎస్ షర్మిల

Advertisement

Next Story

Most Viewed