డీడీలు కట్టినం కానీ, మాకు గొర్రెలియ్యలే

by Anukaran |   ( Updated:2020-08-10 20:38:39.0  )
డీడీలు కట్టినం కానీ, మాకు గొర్రెలియ్యలే
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ అన్నచందంగా తయారైంది గొర్రెల పంపిణీ పథకం. కులవృత్తులను ప్రోత్సహించేందుకు టీఆర్​ఎస్​ సర్కారు అనేక పథకాలు ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే గొల్లకుర్మలకు 75శాతం సబ్సిడీపై జీవాలు పంపిణీ చేయడానికి పూనుకుంది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకంలో అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర జాప్యం నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో మొదటి విడత గొర్రెల పంపిణీ పూర్తికాకముందే అధికారులు రెండో విడతకు శ్రీకారం చుట్టారు. 21,037 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామ సభల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంతో ఆశగా డీడీలు చెల్లించి జీవాల కోసం నెలనెలతరబడి ఎదురుచూస్తున్నారు. మొదటి విడతకే మోక్షం లేకపోవడంతో రెండో విడతలో డీడీలు చెల్లించిన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ‌‌

అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇస్తాయి. కానీ వాటిని అమలు చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నాయి. గొర్రెల పంపిణీ పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. డీడీలు చెల్లిం చిన లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే గొర్రెలను పునరుత్పత్తి చేసి ఉపాధి పొం దాలని ఆశిస్తున్నారు. కానీ లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతుంది. కొంత కాలంగా లబ్ధిదారులు పశుసంవర్ధక శాఖాధికారుల చూట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పచ్చని గడ్డి మొలికెత్తింది. గొర్రెల ఎదుగుదలకు ఇదే మంచి సమయమని లబ్ధిదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడుత పంపిణీలో జరిగిన అవకతవకలకు అవకాశం లేకుండా రెండో విడత పంపిణీ చేయాలని ప్రభు త్వం యోచించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు రెండో విడత గొర్రెల పంపిణీ మాట నీటి మూటగానే మారింది. రంగారెడి జిల్లా వ్యాప్తంగా నెలకు 125 యూనిట్ల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతుంది.

ఇంకా 9,615 యూనిట్లకు జాప్యం…

తెలంగాణలో మాంసం ఉత్పత్తిని భారీగా పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గొల్లకర్మలకు 75శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మొదటి విడత 2017–18 ఆర్థిక సంవత్సరంలో 20,927 యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా జిల్లా అధికారులు నిర్ణయించారు. ఇందులో కేవలం 11,312 యూనిట్లు మాత్రమే సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేశారు. ఇంకా మొదటి విడతలో 9,615 యూనిట్ల గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉంది. మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెలకు రూ.125 కోట్లు వెచ్చించారు. పంపిణీ చేసిన వాటిలో 2,956 గొర్రెల చనిపోయాయి. వీటి స్థానంలో ఇన్సూరెన్స్ ద్వారా విడుదలైన రూ. 1,56,08,800తో 2,709 గొర్రెలను పంపిణీ చేశారు. గతేడాది ప్రారంభం నుంచి మొన్నటి వరకు ఏదో ఒక ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో రెండో విడత పంపిణీకి బ్రేక్‌ పడుతూ నే ఉంది. ప్రస్తుతం ఎలాంటి కోడ్‌ లేకపోవడంతో లబ్ధిదారులు గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారు.

యూనిట్ విలువ రూ.1.25లక్షలు..

ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా టీఆర్ఎస్ 75శాతం రాయితీతో గొర్రెలు పంపిణీ చేస్తోంది. ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక విత్తన పొట్టే లు ఉంటాయి. స్థానికంగా లభించే జీవాలు కాకుండా ఇతర రాష్ర్టాలు, జిల్లాల్లో గొర్రెలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఒక యూనిట్‌ విలువ రూ.1.25 లక్షలు కాగా, అందు లో ప్రభుత్వం యూనిట్‌కు 75శాతం అంటే రూ.93,750 రాయితీ ఇస్తుంది. మిగతా 25శాతం (రూ.31,250) లబ్ధిదారులు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంది. గొర్రెల కొనుగోలుతో పాటు రవాణా చార్జీలు, బీమాకు అయ్యే ఖర్చులు ఇందులోనే ఉంటాయి.

ఈ ఏడాది లక్ష్యం 21,037 యూనిట్లు..

అన్ని జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి జిల్లాలో గొల్లకర్మ కుటుంబాలు అధికంగా ఉన్నాయి. వీరందరూ గొర్రెల పంపిణీపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జిల్లా పశుసంవర్ధక శాఖాధికారులు మొదటి విడతలోనే పూర్తి సమాచారం సేకరించారు. జిల్లాలో ఉన్న గొల్లకుర్మ కుటుంబాలను పశుసంవర్ధక శాఖ అధికారులు సర్వే చేసి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ దరఖాస్తులకు అనుగుణంగా గొర్రెల పంపిణీ విడతల వారీగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మొదటి విడతలో 20,927 యూనిట్ల లక్ష్యంగా… రెండోవ విడత లక్ష్యంగా 21,037 యూనిట్లుగా నిర్ణయించారు. మొదటి విడతలో కొన్ని యూనిట్లకు గొర్రెలు అందించా ల్సి ఉన్నప్పటికీ రెండో విడత గొర్రెల పంపిణీలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story