16 ఏళ్ల బాలికకు 57 ఏళ్ల వ్యక్తితో వివాహం..

by Anukaran |
16 ఏళ్ల బాలికకు 57 ఏళ్ల వ్యక్తితో వివాహం..
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీలో మైనర్ వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 16ఏళ్ల బాలికను డబ్బులకు ఆశపడి సవతి తల్లీ, తండ్రి 57ఏళ్ల వృద్దుడికి ఇచ్చి ఈనెల 27న వివాహం జరిపించారు. ఈ తతంగమంతా పాతబస్తీలోని ఓ మ్యారేజ్ బ్యూరో వ్యక్తులు నడిపించినట్లు తెలుస్తోంది. అందుకోసం కేరళకు చెందిన అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తి నుంచి రూ. 2.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అందులో రూ.లక్షా 50వేలను బాలిక తల్లిదండ్రులకు ముట్టజెప్పారు.

అనంతరం గుట్టుచప్పుడు కాకుండా మైనర్‌ను లతీఫ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ ఘటన ఫలక్ నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగలకుంటలో గురువారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు పెండ్లి కొడుకుతో సహా బాలిక సవతి తల్లీ, తండ్రి మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, పాతబస్తీలో మైనర్ వివాహాలు కొత్తేమీ కాదు. కానీ, చాలా రోజుల తర్వాత మైనర్ పెళ్లి వెలుగుచూడటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

Advertisement

Next Story