సీ‘రియల్’ కష్టాలు

by Shyam |   ( Updated:2020-03-30 09:22:47.0  )
సీ‘రియల్’ కష్టాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీరియల్స్ జీవిత కాలం సాగుతూనే ఉంటాయి. అంత సాగదీత ఉంటుంది సీరియళ్లలో ఐదు నిమిషాల కంటెంట్‌ను 30 నిమిషాలు చూపిస్తూ.. చూసే ప్రేక్షకులకు ఎక్కడలేని ఎగ్జైట్‌మెంట్ కలిగించడం వారికే చెల్లుతుంది. అయ్యయ్యో … రేపు జరుగుతుందో? ఏంటో? తప్పకుండా చూడాలి… అనే ఆత్రుతను పెంచుతూ టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంటారు. ఈ సమయంలో సీరియళ్లు చూసే భార్యలకు భర్త ఏం చెప్పినా వినిపించదు… భోజనం పెట్టమన్నా సరే… అరగంట ఆగండి సీరియల్ అయ్యాక తిందురు గానీ అని చెబుతుంటారు. పిల్లలు చదువులో డౌట్స్ అడిగితే… ఏరా నీకు నేను సీరియల్ చూసే టైంకే డౌట్స్ వస్తాయా అంటూ విసుక్కుంటారు. అంతే కానీ.. సీరియల్‌ను మాత్రం చూడకుండా ఉండే ప్రసక్తే లేదు. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో సీరియల్ మిస్ అయిందే అనుకోండి … ఎలాగూ హాట్‌స్టార్, సన్ నెక్స్ట్, జీ 5 లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమే లేదు.

కానీ… ఇప్పుడు మాత్రం సీరియల్ లవర్స్‌కు సీరియల్ కష్టాలు వచ్చాయి. చూసే వారికే కాదు సీరియల్స్‌కు కూడా సీరియల్ కష్టాలు వచ్చాయి. అదేంటి అనుకుంటున్నారా?.. కరోనా ప్రభావంతో సినిమాల షూటింగ్‌లే కాదు సీరియళ్ల షూటింగ్‌లు కూడా ఆగిపోయాయి. దీంతో కొత్త ఎపిసోడ్ల ప్రసారం ఆగిపోయి…. మళ్లీ పాత ఎపిసోడ్‌లనే ప్రసారం చేస్తున్నాయి చానళ్లు. దీంతో కొంత మంది పాత ఎపిసోడ్లే కదా అని సీరియళ్లను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇంట్లో ఉన్నా కూడా సీరియళ్లను చూడలేకపోతున్నామే అని కొందరు బాధపడుతుంటే… హమ్మయ్యా… వీళ్లను సీరియళ్లు చూడకుండా చేయడం మావల్ల ఏంటీ… మహామహుల వల్లే కాలేదు…. కానీ కరోనా వల్ల అయిందంటున్నారు భర్తలు.

ఈటీవీ, స్టార్ మా, జెమిని, జీ తెలుగు లాంటి చానల్స్‌లో ప్రసారమయ్యే సీరియళ్లకు అభిమానులు ఎక్కువే. ఒక్కో సీరియల్‌కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో పాపులర్ అయిన సీరియళ్లలో కార్తీక దీపం, కుంకుమ పువ్వు, సావిత్రమ్మ గారి అబ్బాయి, గోరింటాకు, గుండమ్మ కథ, త్రినయని లాంటి సీరియళ్ల కొత్త ఎపిసోడ్స్ కరోనా ఎఫెక్ట్ తగ్గే వరకు చూసే పరిస్థితి లేదనే తెలుస్తోంది. మరో వైపు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్, ఢీ, క్యాష్ లాంటి కార్యక్రమాలు కూడా న్యూ ఎపిసోడ్స్ టెలికాస్ట్ త్వరలో ఆగిపోయే చాన్స్ ఉందని సమాచారం.

కొన్ని చానళ్లలో సీరియల్‌కు సంబంధించి పాత ఎపిసోడ్స్ ప్రసారం అవుతుండగా… మరి కొన్ని చానళ్లలో టీఆర్‌పీ రేటింగ్ పడిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇంతకు ముందు ప్రేక్షకులచే అత్యధిక ఆదరణ పొందిన షోలను రీ టెలికాస్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 3 ప్రసారం అవుతుండగా…. జీ తెలుగు, ఈటీవీలో పండగ సందర్భంగా ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న కార్యక్రమాలనే మళ్లీ ప్రసారం చేస్తున్నారు. అవార్డు షోలు, గేమ్ షోలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

దూరదర్శన్‌లో ఒకప్పుడు అత్యధిక ప్రజాదరణ పొందిన మహాభారత్, రామాయణ్ సీరియళ్లు ప్రసారం అవుతుండగా…. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంబురపడిపోతున్నారు 80, 90వ దశాబ్ధానికి చెందిన కిడ్స్. మరో వైపు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సీరియల్ సర్కస్ కూడా ఇప్పుడు టెలికాస్ట్ అవుతుండడంతో.. ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతున్నారు. మొత్తానికి సీరియళ్లు ఆగిపోయినా… ప్రత్యామ్నాయంగా ఓల్డ్ పాపులర్ ప్రోగ్రామ్స్‌ను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్‌నే అందిస్తున్నాయి టీవీ చానళ్లు.

కానీ… కోవిడ్ 19 ఎఫెక్ట్‌తో సీరియళ్ల షూటింగ్ ఆగిపోయి దినసరి సినీ కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా పనులు లేక కడుపు నిండా తినలేకపోతున్నారు. దీంతో వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సీరియల్ నిర్మాతలు. ఓ ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. టెలివిజన్ రంగంలో పని చేసే కూలీలు, జూనియర్ ఆర్టిస్టులకు ఆహార పదార్థాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Tags : Serials, Serial Problems, CoronaVirus, Covid 19

Advertisement

Next Story