సెరేనాకు ఇదే ఆఖరి ఆస్ట్రేలియన్ ఓపెనా?

by Shiva |   ( Updated:2021-02-18 09:09:02.0  )
సెరేనాకు ఇదే ఆఖరి ఆస్ట్రేలియన్ ఓపెనా?
X

దిశ, స్పోర్ట్స్ : ఒకప్పుడు టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్ నుంచి డబ్ల్యూటీఏ టోర్నీ వరకు దేనిలో అయినా విలియమ్స్ సిస్టర్స్‌దే హవా. అమెరికాలో పుట్టిన ఈ నల్లజాతి కలువలు మహిళా టెన్నిస్‌ను మహరాణుల్లా ఏలారు. ముఖ్యంగా అక్క వీనస్ విలియమ్స్ కంటే సెరేనా విలియమ్స్ తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను ఏర్పరచుకున్నారు. రికార్డు స్థాయిలో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన సెరేనాకు నయోమీ ఒసాకా నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చిన్నతనం నుంచి సెరేనా అభిమానిగా ఉన్న ఒసాకా.. తనలాగే పవర్ గేమ్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. సెరేనా బాటలో నడిచిన ఒసాకా.. ఆమె ఆటతీరుతోనే ఆమెనే ఓడించి ఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్‌లో ఓడిన తర్వాత సెరేనా విలియమ్స్ ఎన్నడూ లేని విధంగా అత్యంత భావోద్వేగంతో అభిమానులకు అభివాదం చేసుకుంటూ కోర్టును వీడింది. మరో ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ బరిలో దిగే సమయానికి 40 ఏళ్ల వయసుకు చేరుకుంటుంది. ఇక అప్పటికీ టెన్నిస్ ఆడుతుంటుందో లేదో తెలియని పరిస్థితిలో సెరేనా ఉన్నది.

కల తీరలేదు..

టెన్నిస్‌లో ఓపెన్ ఎరా ప్రారంభమయ్యాక అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన మహిళా క్రీడాకారిణిగా స్టెఫీగ్రాఫ్ (22) రికార్డును సెరేనా విలియమ్స్ 2017లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం ద్వారా దాటేసింది. ప్రస్తుతం సెరేనా ఖాతాలో 23 గ్రాండ్‌స్లామ్స్ ఉన్నాయి. ఆ ఏడాది సెరేనా గర్భంతో ఉండి మరీ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గింది. ఆ తర్వాత బిడ్డకు జన్మనిచ్చి కొన్నాళ్లు ఆటకు దూరంగా ఉన్నది. ఆల్ టైం గ్రాండ్ స్లామ్ రికార్డులు మార్గరెట్ కోర్ట్ (24) పేరు మీద ఉన్నది. ఆ రికార్డును బద్దలు కొట్టడానికి అప్పటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నది. 2018 యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరుకున్న సెరేనా.. నయోమీపై ఓడిపోయింది. ఆనాటి నుంచి నాలుగు గ్రాండ్‌స్లామ్స్ ఆడినా సెరేనా 24 టైటిల్ రికార్డులను మాత్రం చేరుకోలేకపోయింది. ఈ సారి ఎలాగైనా ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గాలనే ధీమాతో కోర్టులో అడుగుపెట్టింది. మొదటి మ్యాచ్‌ నుంచి తన పవర్ గేమ్‌తో ప్రత్యర్థులను ఓడించుకుంటూ సెమీస్ వరకు చేరుకుంది. అయితే ‘నెక్ట్స్ సెరేనా’ అని టెన్నిస్ ప్రపంచంలో పేరు తెచ్చుకున్న నయోమీపైనే సెరేనా ఓడిపోవడం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఆస్ట్రేలియాలో ఒక అడుగుపెట్టదా?

సెమీస్‌లో మ్యాచ్ ఓడిపోయిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సెరేనా విలియమ్స్ తీవ్రం భావోద్వేగానికి గురయ్యింది. ఇదే మీ చివరి ఆస్ట్రేలియన్ ఓపెనా అని ఒక విలేకరి ప్రశ్నించారు. దీనికి కన్నీటిపర్యంతం అయిన సెరేనా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కేవలం 4 నిమిషాల లోపే ప్రెస్ మీట్‌ను అర్థాంతరంగా ముగించింది. ‘తాను ఆటకు వీడ్కోలు పలికితే ఎవరికీ చెప్పనేమో.. ఎందుకంటే నేను ఆటకు గుడ్‌బై చెబుతున్నాననే విషయాన్ని చెప్పలేను. నేను ఉద్వేగాలను ఆపుకోలేను’ అంటూ వ్యాఖ్యానించింది. ఈ ఏడాది వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు యూఎస్ ఓపెన్ కూడా ఉన్నది. ఈ మూడింటిలో ఏదో ఒక గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచి మార్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయాలని భావిస్తున్నది. గతంలోనే తాను రికార్డును బద్దలు కొట్టకపోయినా.. కనీసం సమం చేసిన తర్వాతే ఆట నుంచి నిష్క్రమిస్తాను అని చెప్పింది. ఆ మాట అని మూడేళ్లు గడిచినా ఒక్క గ్రాండ్‌స్లామ్ కూడా గెలవలేకపోయింది. అందుకే ఆస్ట్రేలియా ఓపెన్‌లో అయినా గెలవాలని వచ్చి.. కల తీరకపోవడంతో భావోద్వేగానికి గురయినట్లు సన్నిహితులు అంటున్నారు. వచ్చే ఏడాది సెరేనా ఇక ఆటకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని.. ఆమె ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే అవకాశం లేదని అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed