స్వల్పంగా నష్టపోయిన మార్కెట్లు!

by Harish |
స్వల్పంగా నష్టపోయిన మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్లు నిన్నటి నష్టాలనే కొనసాగించాయి. కరోనాను నిలువరించడానికి లాక్‌డౌన్ పొడిగించడం తప్ప వేరే మార్గం లేదనే ప్రధాని మోదీ సంకేతాలతో ఉదయం 600 పాయింట్ల వరకు నష్టపోయినప్పటికీ లంచ్ సమయం తర్వాత కాస్త కోలుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 190.10 పాయింట్లు నష్టపోయి 31,371 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 42.65 పాయింట్ల నష్టంతో 9,196 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, టైటాన్ షేర్లు లాభాల్లో కొనసాగగా, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదనను ఐబీఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ ముందు ఉంచిందన్న వార్తలు సైతం మదుపర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. షార్ట్ కవరింగ్ కొనుగోళ్లకు తోడు, బ్యాడ్ బ్యాంకు ప్రతిపాదనతో బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో కదలాడాయి. ఈ పరిణామాలు మార్కెట్లకు భారీగా మద్దతు ఇచ్చాయి. మార్చి త్రైమాసిక ఫలితాల ప్రకటనతో పిరమిల్ ఎంటర్‌ప్రైజెస్ 7 శాతానికి పైగా దిగజారింది. రిలయన్స్ కూడా 6 శాతం నష్టపోయింది. మంగళవారం నుంచి రైళ్ల రాకపోకలు నిర్వహించిన నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ వరుసగా రెండోరోజు 5 శాతం లాభాలను చూసింది. మరి కొద్ది రోజుల్లో విమానయాన సర్వీసులు ప్రారంభమవనున్న నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ షేర్లు సైతం లాభపడ్డాయి. యూఎస్ డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.51 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed