45 వేల మార్కును దాటిన సెన్సెక్స్!

by Harish |
45 వేల మార్కును దాటిన సెన్సెక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి రికార్డులను నమోదు చేశాయి. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడించారు. ఈ వార్త అనంతరం సూచీలు జోరందుకున్నాయి. దీనికి తోడు మదుపర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 45,000 మార్కును అధిగమించింది. అంతేకాకుండా, భారత వృద్ధి రేటును ఆర్‌బీఐ సవరించడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 446.90 పాయింట్లు పెరిగి 45,079 వద్ద ముగియగా, నిఫ్టీ 124.65 పాయింట్లు లాభపడి 13,258 వద్ద ముగిసింది.

నిఫ్టీలో అన్ని రంగాలు పుంజుకోగా, ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, ఫార్మా, బ్యాంకింగ్, రియల్టీ, మెటల్ రంగాలు అధికంగా ఎగసిపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో రిలయన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోగా, మిగిలిన అన్ని షేర్లూ లాభపడ్డాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.69 వద్ద ఉంది.

Advertisement

Next Story